మంగళసూత్రానికే ‘పరీక్ష’
ఇందూరు: గ్రూప్–2 పరీక్షకు హాజరైన ఓ మహిళను మంగళసూత్రం తీసేసి పరీక్షకు హాజరుకావాలని ఆదేశించడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని సిద్దార్థ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం గ్రూప్–2 పరీక్షకు హాజరైన ఓ మహిళా అభ్యర్థిని మంగళసూత్రం తీసివేయాలని ఇన్విజిలేటర్ ఆదేశించారు. దానికి సదరు మహిళ ససేమిరా అనడంతో 10 నిమిషాలు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తాళి కంటే పరీక్ష గొప్పేం కాదంటూ వెనుదిరిగింది.
విషయం బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్తపడినట్లు సమాచారం. జిల్లాలోని పలు కేంద్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని మరో పరీక్ష కేంద్రం లో కొత్తగా పెళ్లైన ఓ మహిళా అభ్యర్థిని పసుపుతాడు తీయాలని ఇన్విజిలేటర్ ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీయాలనే నిబంధనలు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నా ఇలాంటి సంఘటనలు జరగడం గమనార్హం.