కర్నూలు మిలీనియం ఉత్సవాల్లో మంగళంపల్లి
కర్నూలు(కల్చరల్): సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్నూలులో 1999లో నిర్వహించిన మిలీనియం ఉత్సవాల్లో పాల్గొని తన గాన కచేరితో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుత సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోపవరం రామచంద్రన్ తన గురువు మహదేవలక్ష్మీ నారాయణరాజు చొరవతో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను కర్నూలుకు ఆహ్వానించారు. అప్పటి జిల్లా కలెక్టర్ ఉమామల్లేశ్వర్రావు కలెక్టరేట్లో సునయన ఆడిటోరియం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 1999 సంవత్సరంలో డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు మిలీనం ఉత్సవాల పేరుతో కర్నూలులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాల్గొన్నారు. మిలీనం ఉత్సవాలను పురస్కరించుకుని అప్పటి కలెక్టర్ ఉమామల్లేశ్వరరావు సునయన ఆడిటోరియంను ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ సభ అనంతరం డాక్టర్ మంగళంపల్లి తన స్వర కచేరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కచేరీలో గోపవరం రామచంద్రన్ ఘటం సహకారాన్ని అందించి ఆయన స్వరానికి తోడుగా నిలిచారు. డాక్టర్ మంగళంపల్లి కచేరీలో కర్నూలుకు చెందిన గోపవరం రామచంద్రన్ రెండుసార్లు సంగీత సహకారం అందించారు. ఢిల్లీలో, చెన్నైలో జరిగిన సంగీత కచేరీలో రామచంద్రన్ డాక్టర్ మంగళంపల్లికి మృదంగ సహకారాన్ని అందించారు. కర్నూలులో 2000 దశకంలో జరిగిన బాలసాయి జన్మదినోత్సవ ఉత్సవాల్లోను మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన గానామృతాన్ని వినిపించి ప్రేక్షకులను, భక్తులను అలరించారు. ఇలా మొత్తంగా బాలమురళీకృష్ణ రెండు పర్యాయాలు కర్నూలు నగరంలో సంగీతాభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
మల్లన్న ఆస్థాన విద్వాంసునిగా..
‘‘శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీశైల మహాలింగ చక్రవర్తికి ఆస్థాన విద్వాంసుడిగా నియామకం కావడం వెయ్యి జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నా..’’ ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2003 అక్టోబర్ 20న శ్రీశైల మహాక్షేత్రానికి ఆస్థాన విద్వాంసుడిగా బాధ్యతలను చేపడుతూ అన్న మాటలివి.
అప్పటి «ఈఓ ప్రసాదరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర రవాణాశాఖమంత్రి సిద్ధా రాఘవరావు, సమక్షంలో బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ రోజు సాగించిన సంగీత విభావరి భక్తులను అలరించింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ స్వామి సన్నిధిలో తన కచేరి సాగుతున్న సమయంలో వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తున్నానని, స్వామిఅమ్మవార్లు కూడా తన గానామృతాన్ని ఆస్వాదించి వరుణుడి రూపంలో ఆశీర్వదించారన్నారు.