జెడ్పీ నూతన అధ్యక్షురాలిగా శోభ
సాక్షి, బళ్లారి :
జెడ్పీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీ.శోభ విజయం సాధించారు. గత అధ్యక్షురాలు సుమంగళమ్మ గుబాజీపై కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెను పదవి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ ఆదిత్య ఆమ్లన్ బిస్వాస్ వ్యవహరించారు. జెడ్పీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీ.శోభ, బీజేపీ నుంచి గెలుపొందిన (బీఎస్ఆర్సీపీ మద్దతుదారురాలు) జీ.సుమంగళమ్మ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. అనంతరం మూడు గంటల సమయంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి బీ.శోభ కు 18 ఓట్లు రాగా, బీజేపీ తరుపున పోటీ చేసిన జీ.సుమంగళమ్మకు 17 ఓట్లు వచ్చాయి. దీంతో శోభ జెడ్పీ అధ్యక్షురాలిగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి బిస్వాస్ ప్రకటించారు.
అనంతరం నూతనంగా ఎంపికైన జెడ్పీ అధ్యక్షురాలు బెండిగేరి శోభ విలేకరులతో మాట్లాడుతూ తన గెలుపునకు ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సహకారం అందించారన్నారు. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరమేశ్వరనాయక్, హరపనహళ్లి ఎమ్మెల్యే రవీంద్ర ఇతర ముఖ్య నాయకులు తాను జెడ్పీ అధ్యక్షురాలు కాబడానికి కృషి చేశారన్నారు. బళ్లారి జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా తాగునీరు, విద్య తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. అనంతరం హరపనహళ్లి ఎమ్మెల్యే ఎం.పీ రవీంద్ర, సండూరు ఎమ్మెల్యే తుకారాం, బళ్లారి నగర డీసీసీ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు నూతన అధ్యక్షురాలు శోభను అభినందించారు.