జగన్ యాత్ర.. రైతుకు భరోసా
మంగళగిరి : రాజధాని ప్రాంత రైతులకు, రైతు కూలీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత ైవె .ఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 3వ తేదీన రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారని, రైతుల్లో ధైర్యం నింపేలా ఆయన పర్యటన సాగుతుందని వివరించారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలు సంయుక్తంగా ఆదివారం జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు. రైతులకు భరోసా కల్పించి వారి సాధకబాధకాలు తెలుసుకోవటానికే జగన్ పర్యటిస్తున్నారని, రైతులు, రైతు కూలీలతో మాట్లాడి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారని తెలిపారు. రాజధాని వ్యవహారంలో రైతులకు తమ పార్టీ అండగా నిలిచిందని ఇప్పటికే పలు దఫాలు పార్టీ నేతలు రైతు సంఘ నాయకులు పార్టీ ప్రతినిధి బృందం, శాసనసభాపక్ష బృందం ఈ ప్రాంతంలో పర్యటించిందని చెప్పారు. తద్వారా పార్టీ నేతలు ఎప్పటికప్పుడు రాజధాని ప్రాంత రైతుల సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సంబంధిత అధికారులతో, పార్టీ నాయకులతోనూ మాట్లాడి రైతులకు అండగా నిలిచారని వివరించారు. రాజధాని నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అసెంబ్లీలోనే పార్టీ అధినేత జగన్ ప్రకటించిన విషయం గుర్తుచేశారు. రాజధాని నిర్మాణ క్రమంలో రైతులు, రైతుకూలీల ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా చూడాలని తాము మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నామన్నారు.
జగన్ పర్యటన షెడ్యూల్ ఇదీ..
మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. అక్కడి రైతులు, రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు నగరానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడి, హైదరాబాద్ తిరుగు పయనమవుతారని పార్టీ నేతలు వివరించారు.