ప్రధాని మోదీ ఉద్బోధ
అక్షర తూణీరం
ప్రధాని మాటని మన్నించి అందరూ రుషుల్లా మారిపోతే ఏమవుతుంది? కనిపించినదల్లా తిని, దొరికినవన్నీ తాగి మహాకాయులుగా తయారవుతారు. అప్పుడసలు ‘‘సూపర్ స్పెషాలిటీ’’ మాటే పుట్టదు.
‘‘అవినీతికి దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి. అహాన్ని వీడండి. సాటి వారికి సాయ పడండి’’ - యిలాంటి సందేశాన్ని అందించారు మోదీ. ‘‘నరుడు నరుడౌటె దుష్కరము సుమ్ము’’ అన్నాడు ప్రవక్త గాలిబ్. మనిషి మనిషిలా బతకడం కంటె గొప్ప మరేదీ లేదు. దీన్ని విజయవంతంగా సాధించడానికి జీవిత కాలం సరిపోదని పెద్దలంటారు. ఒక వేళ నిజంగానే ప్రధాని మాటని మన్నించి అందరూ రుషుల్లా మారిపోతే?! భూమి తలకిందులైపోతుంది. సమతుల్యం సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడ చూసినా ఉత్తములే. అంతటా ఆరోగ్యవంతులే.
దీనివల్ల వచ్చే పరిణామాలను ఒక్కసారి పరిశీలిద్దాం. నూట ఇరవై కోట్ల ఉత్తములు సంచరించే యీనేలని ఒక్కసారి ఊహించండి. రామాయణ కాలంలో మాట వాల్మీకి రాశాడు. భరద్వాజ మహర్షి నదీ స్నానానికి వెళుతుంటే, కూడా అడవి మృగాలు అనుసరించేవట. అది కూడా, ‘‘దాత వెంట యాచకుల వలె’’ అని వుపమానం వాడాడు. ఇక యిలాంటి దృశ్యాలు సర్వసామాన్యమైపోతాయి. ఛాపమానమగు కేసరి కూడా జీర్ణతృణం తినడానికి అలవాటు పడిపోతుంది. పులులు పంజాలు విసరడం మర్చిపోతాయి. రోజూ జంతువులు ఇళ్ల ముందుకు వచ్చి పనిపాటల్లో సాయపడుతూ వుంటాయి. సింహాలు, కుందేళ్లు ఏరా అంటే ఏరా అని పిలుచుకుంటూ కనిపించి వీనుల విందు చేస్తాయి. గాడిద, గుర్రం తారతమ్యాలు లేక భుజం భుజం రాసుకుంటూ కనిపిస్తాయి. పిల్లులు.. గద్దలు, ఎలుకలకు కాపలా కాస్తుంటాయి. ఈ విధంగా మంచితనం అనేది భరించలేనంత దుర్భరంగా మారిపోతుంది.
ఇక అందరూ ఆరోగ్యవంతులే. వజ్రకాయులే. వైద్యులు గోళ్లు గిల్లుకుంటూ, అది తప్పని గుర్తొచ్చి నాలిక కరుచుకుంటూ కాలక్షేపం చేస్తూ వుంటారు. మనుషులు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కనుక కనిపించినదల్లా తిని, దొరికినవన్నీ తాగి మహాకాయులుగా తయారవుతారు. అప్పుడసలు ‘‘సూపర్ స్పెషాలిటీ’’ మాటే పుట్టదు. ఆఖరికి డెంటిస్ట్లకి కూడా పని వుండదు. దానివల్ల మెడికల్ కాలేజీలుండవు. డొనేషన్లు, స్టెతస్కోపులు కనుమరుగవుతాయి. నర్సులుండరు. యాంటీ బయాటిక్స్, ఇన్సులిన్లతో పన్లేదు. దేహానికి వ్యాధి సంక్రమించదు కాబట్టి మరణం సంభవించే అవకాశం వుండదు. వందల సంవత్సరాలు అవలీలగా మనుషులు బతికేస్తూ వుంటారు. నాలుగైదు తరాల వారు కలసి బతుకుతూ వుంటారు.
జీవితం బుడగ కాదు బండరాయి అనే సిద్ధాంతం వస్తుంది. శంకరుని మాయావాదం పని చెయ్యదు. మిగిలిన అంశాలను మీ వూహకే వదిలేస్తున్నా. సాటివారికి సాయపడే పనిలో అందరూ బిజీ బిజీ అయిపోతారు. ఎవరి పనులు వారు చేసుకోవడం మానేసి, పక్క అపార్ట్మెంట్ వారికి స్నానాలు చేయించడం, వస్త్రాలు వాష్ చేయడం, వారి కుక్కల్ని షికారు తీసికెళ్లడంలో నిమగ్నమైపోతారు. ఇరుగు పొరుగుల సాయం భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇక చివరగా అహాన్ని వీడడం - అందరి సూచనలు విని చక్కగా పాటించడం, అందరూ అహాన్ని కాశీలో వదిలి పెడితే -? ఇక మనకు మోదీలు దొరకరు. దేశాన్ని పాలించే నేత కరువైపోతాడు.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)