‘అవును.. అతను ర్యాష్ డ్రైవింగ్‌తో చనిపోయాడు’
ప్రమాద ఘటనలో నిర్ధారించిన కోర్టు
న్యూఢిల్లీ: బాధ్యతా రాహిత్యంతో వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన నిందితుణ్ని దోషిగా నిర్ధారిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. ఇతర ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసి నిందితుడు వాహనాన్ని నడిపిన విషయం రుజువైందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును విచారించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మనీషా ఖురానా నిందితుడు రాజేష్(ఉత్తరప్రదేశ్)ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో నిందితుడు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించాడని న్యాయమూర్తి చెప్పారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నిందితుని ప్రవర్తన చూస్తుంటే స్వతహాగా నేరాలోచన ఉన్నట్లు తేలిందన్నారు. నిందితుడు దోషి అని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ కూడా సఫలమైందని తెలిపారు. కాగా, ఈ సందర్భంగా ప్రత్యక్షసాక్షిని విచారించారు.
ప్రమాదస్థలికి సమీప ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రాజీవ్‌సింగ్ ఘటన జరిగిన విధానాన్ని కోర్టుకి తెలియజేశారు. రెడ్ సిగ్నల్ పడినా కూడా ఆగకుండా నిర్లక్ష్యంతో వేగంగా నిందితుడు ముందుకు దూసుకెళ్లాడని అతను చెప్పాడు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని రాజీవ్ తెలిపాడు. సంఘటన వివరాలు.. రాజేష్ అనే వ్యక్తి తన ట్రక్‌లో 2011, మే 9న అన్సాల్ ప్లాజా వైపు వేగంగా దూసుకువచ్చాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగకుండా వెళ్లి లోధి కాలనీ వైపు నుంచి వచ్చిన ఓ కారును ఢీకొట్టాడు. దీంతో ఆ కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ గుజ్రాల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అత్యవసర చికిత్స నిమిత్తం అతన్ని ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్‌కి తీసుకెళ్లగా, అప్పటికే గౌరవ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో నిందితుడైన రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.