దగ్గర దారే మృత్యుమార్గం అయ్యింది!!
చిన్నారుల ప్రాణాలను కర్కశంగా తీసుకెళ్లిపోయిన ప్రమాదం జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. దగ్గర దారి అనుకుని కాపలా లేని రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. బస్సుకు రోజూ వచ్చే డ్రైవర్ రాకపోవడంతో.. మరో డ్రైవర్ను పిలిపించారు. మాసాయిపేట వద్ద మొత్తం మూడు రైల్వే లెవెల్ క్రాసింగులు ఉన్నాయి. వాటిలో రెండింటికి గేట్లు, కాపలా కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ కాదని, గేటు ఉండదన్న ఉద్దేశంతోనే మూడో క్రాసింగ్ మీదుగా వెళ్లాడని, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తం మూడు క్రాసింగులకు మధ్య దూరం కూడా కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రమేనని దక్షిణమధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాపలా ఉన్న గేట్లు అయితే ఆగాల్సి వస్తుందని, గేటు లేనిచోట అయితే నేరుగా వెళ్లిపోవచ్చని డ్రైవర్ భావించడమే ఈ పెను ప్రమాదానికి కారణమైంది. 14 మంది చిన్నారులను కర్కశంగా చిదిమేసింది.
సెల్ఫోనులో మాట్లాడుతూ..
బస్సు డ్రైవర్ సెల్ఫోనులో మాట్లాడుతుండటం వల్లే అతడు రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిట్టచివరి నిమిషంలో వెనుక నుంచి పిల్లలంతా రైలు.. రైలు అని అరవడంతో ఒక్కసారి కంగారుపడి ఆలస్యంగా బ్రేకులు వేశాడని, కానీ.. దానివల్ల బస్సు ఆగకపోగా రైలు పట్టాల మీదుగా జారిపోవడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొందని అంటున్నారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)