'విడాకులు ఎప్పుడు ఇస్తారు?'
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు ముదురుతున్నాయి. రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది. తమ నుంచి విడిపోవాలని శివసేన పార్టీకి బీజేపీ బహిరంగంగా సవాల్ విసిరింది. తమ పార్టీ నుంచి ఎప్పుడు విడాకులు తీసుకుంటారని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ బండారి ప్రశ్నించారు. మహారాష్ట్ర బీజేపీ పక్షపత్రిక 'మనోగత్'లో 'తలాక్ ఎప్పుడు తీసుకుంటారు' పేరుతో రాసిన వ్యాసంలో శివసేనపై విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై కూడా విమర్శలు గుప్పించారు.
నిజాం ప్రభువులా తమను అణచివేస్తున్నారని రౌత్ చేసిన వ్యాఖ్యలపై మాధవ్ మండిపడ్డారు. అణచివేతను గురువుతున్నామని చెబుతున్న శివసేన తమతో ఇంకా ఎందుకు కలిసివుందని ప్రశ్నించారు. దమ్ముంటే బీజేపీ విడాకులు ఇవ్వాలని సవాల్ చేశారు. 'నిజాం' ఇచ్చిన ప్లేటులో ఒక చేత్తో బిర్యానీ తింటూ, మరో చేత్తో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారా అని నిలదీశారు. తమ పార్టీతో కలిసివుంటునే విమర్శలు చేయడం సరికాదని మాధవ్ బండారి పేర్కొన్నారు.