రక్షణశాఖ మంత్రిపదవికి పారికర్ రాజీనామా
న్యూఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి పదవికి మనోహర్ పారికర్ సోమవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పీఎంవోకు పంపించారు. కాగా గోవా ముఖ్యమంత్రిగా పారికర్ మంగళవారం సాయంత్రం అయిదు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. అయితే ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రశ్నకు పారికర్ సమాధానం దాటవేశారు. అయితే కేబినెట్ కూర్పు పూర్తయిందని, దీనిపై మీడియాకు తామే సమాచారం ఇస్తామన్నారు.
కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తగిన మెజార్టీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సహా ఆరుగురు మంత్రులు ఓటమి చవిచూడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా గోవా ఫార్వర్డ్ పార్టీ (ముగ్గురు ఎమ్మెల్యేలు), ఏంజీపీ(ముగ్గురు ఎమ్మెల్యేలు)తో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు.
అయితే బీజేపీ ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పారికర్ సీఎంగా రావాలని కోరడంతో బీజేపీ అధిష్టానం సూచన మేరకు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన గతంలో గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు గత ఎన్నికల్లో పార్టీని గెలిపించిన పారికర్‌ను 2014 కేంద్ర రక్షణశాఖలోకి తీసుకున్న విషయం తెలిసిందే.