ఏలికల ఎత్తు బిడ్డ ‘సిట్’
ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ వెల్లడించిన అంచనా రూ. 60 లక్షల కోట్లు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ మొత్తం ఎంపీలలో 442 మంది కోటీశ్వరులే. మోడీ మిత్రులు అదానీ, అంబానీలు సైతం లక్ష్మీపుత్రులే. కాబట్టి సిట్ ఎలా పని చేయగలదో ఊహించవచ్చు.
వాస్తవాలు బయటకు పొక్కకుండా కప్పెట్టే పని చేసినవారిలో నరేంద్రమోడీయే మొట్టమొదటి రాజకీయ నాయకుడు కాదు. ఇలా ఇండియాలో నిజాలను టక్కుటమారంతో తొక్కిపెట్టడమనేది రాను రాను ఒక ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితులలో నిజనిర్ధారణ అనేది గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది మాత్రమే! మనోజ్ మిట్టా (టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ సంపాదకుడు, ‘ది ఫిక్షన్ ఆఫ్ షాక్డ్ ఫైండింగ్’ (2014) గ్రంథకర్త) దేశ విదేశాలలోని రహస్య మాళిగలలో (బ్యాంకులు) మూలుగుతున్న భారతీయ కోటీశ్వరుల, రాజకీయ మహా కోటీశ్వరుల నల్లధనం వ్యవహారం దేవతావస్త్రాల కథ మాదిరిగా మారింది.
విదేశాలలో గుప్త నిధులకు రక్షణ దుర్గాలుగా ఉన్న స్విట్జర్లాండ్, కోస్టారికా, వాటికన్, మారిషస్ బ్యాంకులలో ఈ కోటీశ్వరులు మేట వేసుకున్న నల్లధనాన్ని ‘వెలికి తీయడానికి’ యూపీయే ప్రభుత్వం ఆడిన నాటకాన్నే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగించదలచింది. ప్రజాధనాన్ని కాపాడేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉదార స్వభావంతో తీసుకున్న నిర్ణయం మాత్రం కాదది. నల్లధనం సమస్య మీద తక్షణమే విచారణ జరిపి, నల్లధనాన్ని దేశానికి తిరిగి తీసుకురావలసిందని అవసాన దశలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ విచారణకు ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)ను నియమించాలని సుప్రీం సూచించింది. మోడీ ప్రభుత్వ నిర్ణయం దాని ఫలితమే.
సుప్రీం కోర్టు ఆదేశంతోనే కదలిక
విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించాలన్న డిమాండ్ కొత్తది కాదు. ఏళ్లూపూళ్లుగా వినిపిస్తున్నదే. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ అంశంపై విచారణను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా 2011 నుంచి దీనికి సంబంధించి ఆదేశాలు ఇస్తూనే ఉన్నది. కోర్టుల ఒత్తిళ్లతో ఈ ప్రభుత్వాలు పరిమితంగానే అయినా కొన్ని పేర్లు వెల్లడించాయి. మళ్లీ అందులో కూడా ‘ఫలానా వారి పేర్లను దయచేసి వెల్లడించకండి’ అంటూ ప్రభుత్వాలు సీల్డు కవర్లలో కోర్టులను అభ్యర్థించిన వైనాలూ ఉన్నాయి. ఇలాంటి అనివార్యతల మధ్య మోడీ ప్రభుత్వం కూడా ‘సిట్’ ఏర్పాటుకు సిద్ధంకాక తప్పలేదు. ఈ నిజనిర్ధారణ సంస్థ కూడా ముందుకు నడవదని మోడీకి తెలిసినా, విశ్రాంత జస్టిస్ ఎంబీ షా అధ్యక్షులుగాను, మరో విశ్రాంత జస్టిస్ ఆర్జిత్ పసాయత్ ఉపాధ్యక్షులుగాను ‘సిట్’ అవతరించింది.
రాజ్యాంగబద్ధత ఉన్నప్పటికీ సీబీఐ, సిట్లు కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కూడా పాలక పక్షాల ‘పంజరం చిలుక’ల వలే వ్యవహరిస్తున్నాయి. పాలక పక్షాలు కాంగ్రెస్, బీజేపీ దేనికదే తన కంట్లోని అవినీతి దూలాన్ని గమనించడానికి ఇష్టపడలేదు. ప్రజల మౌలిక ప్రయోజనాల రక్షణను గాలికి వదిలి ఈ రెండు రాజకీయ పక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ విచారణ సంస్థల నిర్ణయాలను ప్రహసన ప్రాయం చేస్తూ వచ్చాయి. ఎందుకని? కాంగ్రెస్, బీజేపీ సహా ఏఏ పార్టీలకు. ఏఏ రాజకీయవేత్తలకు పరోక్షంగా ప్రత్యక్షంగా విరాళాలు ఇస్తున్న బడా పారిశ్రామికవేత్తల పేర్లు విచారణ సమయంలో దాచినా దాగని సత్యంలా బయ టపడవలసి వస్తుంది. అందువల్ల ఎంతటి నిక్కచ్చి మనిషి అయిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిగినా, ఎవరినీ వదిలేది లేదని రాజకీయ నాయకులు ప్రకటించినా ఈ విషయంలో పెద్దగా ఆశించగలిగేది ఏమీలేదు. అయితే, రాజకీయ పెద్దలు, కా ర్పొరేట్ పెద్దలు ఎవరైనా సరే, నల్లధనం వెనుకేసుకుంటే వదిలేది లేదు అని జస్టిస్ షా ప్రకటించారు. ఆయన ప్రయత్నం సఫలం కావాలనే ఆశించాలి.
సిట్ ప్రయోజనం నెరవేరుతుందా?
కానీ, జస్టిస్ షా ఇచ్చిన ప్రకటన, ప్రస్తుత ధనికవర్గ వ్యవస్థనూ, దేశంలోనూ రాష్ట్రాలలోనూ అధికారం చేపట్టిన (టీడీపీ సహా) పార్టీల స్వభావాన్ని పూర్తిగా అంచనా వేసి ఇచ్చిన ప్రకటనలా కనిపించదు. 1990 నుంచి 2014 వరకు చట్టసభలలో పెరుగుతూ వచ్చిన అవినీతిపరులూ, నేరగాళ్ల సంఖ్యను చూస్తే అందరం సిగ్గుతో తలదించుకోవాలి. ఇది ఎన్నో సర్వేలలో తేలిన వాస్తవం. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ బయటపెట్టిన అంచనాలు జస్టిస్ షా నాయకత్వంలోని ‘సిట్’ విచారణకు అగ్నిపరీక్షలే. 16వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో 186 మంది (34 శాతం) నేరగాళ్లు ఉన్నారు.
వీరిలో 112 మంది (24 శాతం) తీవ్ర నేరారోపణలను ఎదుర్కొంటున్నవారే. ఎన్నికల సంఘం ఎదుట అఫిడవిట్లు దాఖలు చేసిన వారంతా గుప్త నిధుల మాదిరే, తమ చీకటి బతుకుల గురించి పూర్తిగా వెల్లడిస్తారని ఆశించడం అనవసరం. రాజ్యాంగంలో పేర్కొన్న ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ, లెజిస్లేచర్ విభాగాలు ఒకదాని వ్యవహారాలలో వేరొకటి జోక్యం చేసుకోరాదన్న క్లాజు చాటున ప్రజాప్రతినిధి న్యాయస్థానాల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్న వ్యవస్థలో ‘సిట్’ ఉనికి ప్రశ్నార్థకం కాకతప్పదు.
వాస్తవం వేరుగా లేదా?
సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టుకు అందచేసిన వివరాల ప్రకారం విదేశాలలో భారతీయులు దాచుకున్న నల్లధనం రూ. 19 లక్షల కోట్లు. రూ. 24 లక్షల కోట్లని సీబీఐ అంచనా. కాగా, ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ వెల్లడించిన అంచనా రూ. 60 లక్షల కోట్లు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ మొత్తం ఎంపీలలో 442 మంది కోటీశ్వరులే. మోడీ మిత్రులు అదానీ, అంబానీలు సైతం లక్ష్మీపుత్రులే. కాబట్టి సిట్ ఎలా పని చేయగలదో ఊహించవచ్చు. అసలు బీజేపీ లేదా అంతకు మందు పీవీ హయాంలోగానీ జరిగిన ఏ సిట్ విచారణ అయినా, సీబీఐ విచారణ అయినా ఒక కొలిక్కి వచ్చిన దాఖాలాలు ఉన్నాయా? జైన్ హవాలా కేసులో అద్వానీ ప్రభృతులు బయటపడ్డారు.
కానీ సీబీఐ, సిట్లను సుప్రీంకోర్టు ఎందుకు మందలించవలసి వచ్చిందో చెప్పగలరా? ఇటీవలి బొగ్గు, ఇతర కుంభకోణాల విచారణ ఎందుకు ఒక కొలిక్కి రావడం లేదు? ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాల మీద పలువురు దాఖలు చేసిన రిట్లు కోర్టులలో ఒక బెంచ్ నుంచి మరొక బెంచ్‌కి, కింద కోర్టు నుంచి పై కోర్టుకీ పదేళ్లుగా ఎందుకు తిరుగుతున్నాయి? గౌరవ న్యాయమూర్తులు లోకూర్, ఈశ్వరయ్య, సుప్రీంలో భండారే వంటివారు ఇటీవల కేసుల విచారణ ప్రక్రియలో ఎందుకు తప్పుకుంటున్నారు? వీటన్నిటికీ తలమానికమైనది గుజరాత్ గోధ్రా అల్లర్ల గొడవ. మోడీ హయాంలో జరిగిన ఈ ఉదంతం మీద 12 ఏళ్లుగా జరుగుతున్న విచారణలు ఎటూ తేలకుండా ఎందుకు మిగిలి ఉన్నాయి? విచారణకు ఆర్కే రాఘవన్ నాయకత్వాన సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ పద్ధతిని అదే కోర్టు నియమించిన పర్యవేక్షకుడు (ఎమికస్ క్యూరీ) రాజురామచంద్రన్ ఎందుకు వ్యతిరేకించవలసి వచ్చింది. మోడీని శిక్షించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈయన ఎందుకు నివేదించాడు? 1984లో ఢిల్లీలో సిక్కుల మీద జరిగిన దురాగతాల మీద నియమించిన మిశ్రా కమిషన్ రాజీవ్‌గాంధీని ప్రశ్నించకుండా ఎందుకు వదిలేసింది? గుజరాత్ మారణకాండకు సంబంధించి నానావతి కమిషన్ మోడీని ప్రశ్నించడానికి ఎందుకు నిరాకరించింది?
1969లో గుజరాత్లో జరిగిన మత ఘర్షణలపై విచారణ జరిపిన జస్టిస్ పి.జగన్మోహన్రెడ్డి కమిషన్, ముంబై అల్లర్ల మీద విచారించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ముఖ్యమంత్రులను సాక్షులుగా కోర్టులకు రప్పించగలిగాయి. ఇది దేశానికి తెలుసు. ప్రైవేట్ విచారణను ప్రతిపాదించిన గుజరాత్ ముఖ్యమంత్రిని రెడ్డి కమిషన్ మందలించింది కూడా. దీనితో స్పష్టమైన సందేశాన్ని న్యాయవ్యవస్థకు విడిచి వెళ్లింది. ప్రైవేటు విచారణలు, సిట్టిం గులు విచారణ విలువను ఊడ్చిపెడతాయి అని పేర్కొంది. అయోధ్య ఘటనలపై విచారణ జరిపిన లిబర్హాన్ కమిషన్ తూతూ మంత్రం నివేదికను ఇచ్చిం ది. చిత్రం ఏమిటంటే 1919 నాటి జలియన్‌వాలాబాగ్ దురంతం మీద విచారణ జరిపిన హంటర్ కమిషన్ అయిదు మాసాలలోనే రెండు నివేదికలు ఇచ్చింది. కానీ ఈ కాలంలో ఒక నివేదికకు దశాబ్దాలు పడుతోంది. ఇదంతా అధికారాలు చేపట్టిన హంతకులను శిక్షల నుంచి తప్పించడానికే.
- (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
ఏబీకే ప్రసాద్