తండ్రి జీవిత కథలో నటించేందుకు హీరో రెడీ
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సైఫ్ అలీఖాన్ తన తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీ జీవిత కథలో నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అది సాహసమే అయినా ఆ పాత్రలో నటించాలన్న కోరిక తనకు ఉందన్నాడు సైఫ్. ప్రస్తుతం బాలీవుడ్లో క్రీడాకారుల జీవిత చరిత్రల ఆదారంగా చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. మేరికోమ్, బాగ్ మిల్కా బాగ్ సినిమాల సక్సెస్ తో ఈ ట్రెండ్ మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో పటౌడీ జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలన్న ఆలోచనతో పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైఫ్ ను సంప్రదించారు.. ఈ ప్రాజెక్ట్ చేయడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదన్న సైఫ్, కథా కథనాలు మాత్రం ఇంట్రస్టింగ్‌గా ఉండాలన్న కండిషన్ పెట్టాడు. స్టైలిష్ బ్యాట్స్ మన్ గా పేరున్న పటౌడీని స్క్రీన్ మీద ఇమిటేట్ చేయటం సాధ్యం కాదన్న సైఫ్, తను ఆ పాత్రకు న్యాయం చేయలేకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కొవలసి వస్తుందని భావిస్తున్నాడు.
సైఫ్ చాలా కాలంగా తన తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడి జీవిత చరిత్రపై ఓ డాక్యుమెంటరీ నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికీ అదే ప్రయత్నాల్లో ఉన్న సైఫ్.. డాక్యుమెంటరీ నిర్మించే అన్ని వీడియోలు అందుబాటులో లేకపోవటంతో ఆలస్యం అవుతుందన్నాడు. ముఖ్యంగా ఒక కన్ను కోల్పోయిన తరువాత కూడా క్రికెటర్ గా కొనసాగటం, ఆయన ఆటను వదిలిపెట్టి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకోవటం లాంటి అంశాలు పటౌడీ జీవితంలో ఆసక్తికరంగా ఉంటాయన్నారు.