'మధుకర్ మృతిపై హోంమంత్రి స్పందించాలి'
ప్రభుత్వాన్ని కోరిన మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: మంథనిలో దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతిపై హోంమంత్రి స్పందించాలని, సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మధుకర్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వారికి న్యాయం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
మధుకర్ మృతి విషయంలో రాజకీయ నాయకులపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ సంఘటనలో బాధితులకు న్యాయం చేయాలని, అసలైన దోషులకు శిక్ష పడేవిధంగా సమగ్ర విచారణ జరిపించాలని మల్లు రవి అన్నారు. మధుకర్ శవంపైన దెబ్బలున్నాయని, మర్మావయాలపై గాయాలున్నాయని, అది హత్య అనే అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వెంటనే హోం శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించాలని రవి కోరారు.