'దిల్ వాలే' అభిమానులకు శుభవార్త
ముంబై: భారతీయ సినీ చరిత్రలో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా బాలీవుడ్ లో రికార్డ్ సాధించిన చిత్రం దిల్ వాలే దుల్హనియా లే జాయింగే. బాలీవుడ్లో సంచలనం సృష్టించిన దిల్వాలే దుల్హానియా లేజాయింగే (డీడీఎల్) నగరంలోని మరాఠా మందిర్‌లో గత 20 ఏళ్లుగా (1009 వారాలు) నిత్యం ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని శుక్రవారం నాటి నుంచి నిలిపివేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం, చిత్రం పంపిణీ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ గురువారం ప్రకటించాయి. అయితే ప్రదర్శనను కొనసాగించాల్సిందిగా వేలాది మంది ఈ సినిమా అభిమానుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌కు వారు తలొగ్గక తప్పలేదు.
1995లో విడుదలైన నాటి నుంచి డీడీఎల్ను మరాఠా మందిర్ ప్రదర్శిస్తోంది. కొన్నేళ్లపాటు అన్నీ ఆటల్లోనూ ప్రదర్శితమైన ఈ చిత్రం ఆ తర్వాత మార్నింగ్ షోగా మాత్రమే ఉదయం 9.15 గంటల సమయానికి ప్రదర్శితమౌతూ వచ్చింది. ప్రదర్శనను మళ్లీ కొనసాగించాలని నిర్ణయించిన థియేటర్ యాజమాన్యం ఈ రోజు నుంచి మార్నింగ్ షో వేళను 11.15 గంటలకు మార్చింది. థియేటర్ సిబ్బంది సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపై వినోద పన్నును రద్దు చేసిన కారణంగా కేవలం 20 రూపాయలకే ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.