marathi medium
-
Theli Rajeshwari: మురికివాడ నుంచి లండన్ వరకు
తేలి రాజేశ్వరిది మెదక్ జిల్లా దప్పూరు. వలస కూలీలుగా తల్లిదండ్రులు ముంబైకి వెళితే అక్కడే పుట్టింది. స్లమ్స్‌లో ఉన్నా మరాఠీ మీడియంలో చదువుకున్నా ఏనాటికైనా పై చదువులకు విదేశాలకు వెళ్లాలని పట్టుదల. దానిని సాధించింది. లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న రాజేశ్వరి తన చదువు కొనసాగించడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తోంది. ఆమె ప్రయాణం ఆమె మాటల్లో. ‘నా పేరు రాజేశ్వరి. మాది మెదక్ జిల్లా దప్పూరు. మా అమ్మానాన్నలు వలస కూలీలు. ముంబై వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. ఎక్కడ కడుతుంటే దాని బేస్మెంట్లో పట్టాలు కట్టుకుని కాపురం ఉండేవారు. అంధేరిలో వాళ్లు కూలి పని చేస్తుండగా నేను పుట్టాను. నాకు అప్పటికే అన్న ఉన్నాడు. ఎల్.కె.జి, యు.కె.జి నేను మరాఠి స్కూల్లో చదువుకున్నాక ముంబైలో చదువు కష్టమని నన్ను, అన్నను దప్పూరులోని మా నానమ్మ దగ్గరకు పంపారు. అక్కడ మళ్లీ అఆలు నేర్చుకోవడం నాకు కష్టమైంది. ఐదవ క్లాసు పూర్తయ్యేసరికి మా నానమ్మ చనిపోయింది. ఇక ఊళ్లో ఎవరూ లేరు. మళ్లీ అన్నా, నేను ముంబై చేరుకున్నాం’. ► పనిపిల్లగా ఉంటూ ‘2006లో ముంబైకి వచ్చాక ఆరోక్లాసు నుంచి చదవడానికి తెలుగుమీడియం స్కూల్ దొరకలేదు. మేముండే ములుండ్ నుంచి గంట దూరం వెళ్లి చదువుకుందామన్నా దొరకలేదు. చివరకు దగ్గరిలోని కన్నడ మీడియం స్కూల్లో చేరాల్సి వచ్చింది. నేను ముంబై వచ్చాక బాగా చదువుకోవాలని అనుకున్నాను. దానికి డబ్బు కావాలి. అందుకని నేను స్కూలుకు వెళ్లడంతోపాటు దగ్గరి ఇళ్లల్లో పనిపిల్లగా చేసేదాన్ని. అందుకు నేను కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. టెన్త్ వరకూ అలాగే చదువుకున్నాను. ఇంటర్‌కి వచ్చేసరికి కాలేజీకి అరాకొరా వెళుతూ టెలీకాలర్‌గా పని చేశాను. దానివల్ల అకౌంట్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఇక పై చదవలేనేమో అనిపించింది. ఎలాగో ఇంటర్ పూర్తి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగంలో చేరిపోయాను. అంతవరకూ నేను జీవితం గడిపింది స్లమ్స్‌లోనే’ ► మళ్లీ చదువుకు ‘ఇంటర్ అయ్యాక నేను ముంబైలోని ఎక్సెంచర్ సంస్థలో ఒక ఏజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరాను. ఇంటర్ పాస్ మీద వారిచ్చిన ఉద్యోగం నాకు తృప్తిగా ఉండేది. కాని 2018 వచ్చేసరికి నా ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల లేదు. డిగ్రీ లేని నీకు ఈ మాత్రం జీతం ఇవ్వడమే గొప్ప అన్నారు సంస్థ వారు. మళ్లీ చదువు గుర్తుకొచ్చింది. ఏమిటి ఇలా తయారయ్యాను అనుకున్నాను. పై చదువులు చదవాలన్న పట్టుదల గుర్తుకొచ్చింది. ఎలాగైనా నా కలను సాధించుకోవాలనుకున్నాను. కాని ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలని అలాంటి ఆప్షన్ కోసం ఎన్ని కాలేజీలు తిరిగినా వీలు కాదన్నారు. కరెస్పాండెన్స్ కోర్సు చేయమన్నారు. చివరకు కల్యాణ్ (ముంబైలోని ఒక ఏరియా) లో సంకల్ప్ కాలేజీ వాళ్లు నా తపన చూసి నీకు వీలున్నప్పుడు వచ్చి అటెండ్ అవుతూ ఉండు అని సీట్ ఇచ్చారు. అక్కడ నేను బికాం చేరాను. నా ఉద్యోగం వారంలో ఐదు రోజులు. ఏ రెండు రోజులైనా ఆఫ్ తీసుకోవచ్చు. అలా నేను అందరిలా శని, ఆదివారం కాకుండా వీక్‌డేస్ ఆఫ్ తీసుకుంటూ 2021 జూన్‌లో బి.కాం పూర్తి చేశాను. ఉద్యోగం చేస్తూ జాగ్రత్తగా పొదుపు చేస్తూ వచ్చాను’ ► యు.కె. కల ‘ఒకవైపు చదువు, ఉద్యోగంతో పాటు విదేశాలలో చదవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకుంటూ వచ్చాను. పాస్‌పోర్ట్ కోసం నా పర్మినెంట్ అడ్రస్ దప్పూర్ కావడం వల్ల హైదరాబాద్ నుంచే తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం ఆధార్ కరెక్షన్, సర్టిఫికెట్లు చాలా పని. మరో వైపు 2022 సెప్టెంబర్ ఇన్‌టేక్ (యూకేలో సెప్టెంబర్‌లో మొదలయ్యే అకడెమిక్ ఇయర్ కోసం) కోసం ఆన్లైన్లో ఆయా యూనివర్సిటీల్లో అప్లికేషన్స్ వేస్తూ వెళ్లాను. కాని యు.కెలో చదవడం చాలా ఖర్చుతో పని. అందుకోసం నేను బ్యాంకులోను, వడ్డీ మీద బయటి వ్యక్తుల దగ్గర లోన్ తీసుకున్నాను. యూకేలో మాస్టర్స్ చేయడానికి నాకు సీట్ వచ్చింది. సెప్టెంబర్ 2022లో లండన్ చేరుకున్నాను. చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్ చేయడానికి పరిమిత గంటల అనుమతి ఉంటుంది. కాని అక్కడ వెంటనే పని దొరకదు. సులభంగా దొరికే ఉద్యోగం కేర్‌హోమ్‌లలో పని చేయడమే. మతి స్థిమితం లేనివారు, వృద్ధులు... వీరి బాగోగులు చూసుకుంటే డబ్బులు ఇస్తారు. అలా ఆరు నెలలు పని చేశాను. నాకు డిజిటల్ మార్కెటింగ్‌తో బాగా పరిచయం ఉంది కాబట్టి అందులోనూ సంపాదన వెతుకుతున్నాను. ముంబైలో స్లమ్స్‌లో ఉండిపోవలసిన దాన్ని. నా కష్టమే నన్ను యూకే దాకా చేర్చింది. ఇక్కడకు వచ్చి 9 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈస్టర్ సెలవలు నడుస్తున్నాయి. ఈ సెలవుల్లో ఎక్కువ గంటలు పని చేయవచ్చు. పని చేస్తున్నా. కష్టేఫలి అన్నారు కదా’. -
ప్రశ్నపత్రాలు.. ప్రశ్నార్థకం?
బేల, న్యూస్‌లైన్ : మరాఠీ మీడియం విద్యార్థులపై ఆర్వీఎం ఉన్నతాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వచ్చే రెండో తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అర్ధ సంవత్సరం (సంగ్రహణాత్మక-2) పరీక్షలు ప్రారంభం కానుండగా మరాఠీ మీడియం పాఠశాలల్లోని 6, 7, 8వ తరగతుల ప్రశ్నపత్రాలను ఆర్వీఎం సరఫరా చేయలేదు. పెపైచ్చు ఆయూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే ప్రశ్నపత్రాలు తయూరు చేసుకోవాలని హుకుం జారీ చేయడం విమర్శలకు దారితీస్తోంది. బేల మండల కేంద్రంతోపాటు కోగ్దూర్లో జెడ్పీహెచ్‌ఎస్‌లు, బెదోడ, దహెగాం, కొబ్బాయి, సోన్‌కాస్ గ్రామాల్లో ప్రాథమికోన్నత మరాఠీ మీడియం పాఠశాలలు ఉన్నాయి. మండలంలోని తెలుగు, ఉర్దూ మీడియం 6, 7, 8వ తరగతుల అర్ధ సంవత్సర పరీక్షల నిర్వహణకు ఇప్పటికే రాజీవ్ విద్యామిషన్ నుంచి మండల కేంద్రంలోని ఎమ్మార్సీకీ ప్రశ్నపత్రాలు సరఫరా అయ్యాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా సీఆర్పీలు, ఆయా ప్రధానోపాధ్యాయులకు ప్రశ్నపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కానీ మరాఠీ మీడియం ప్రశ్న పత్రాలు ఇంకా సరఫరా రాలేదు. మరో నాలుగు రోజుల్లో పరీక్షలు ఉన్నారుు. ఈ ప్రశ్నపత్రాల కోసం శనివారం స్థానిక ఎమ్మార్సీలో సంప్రదిస్తే.. ‘మమ్మల్నే తయారు చేసుకోవాలని ఇప్పుడు చెబుతున్నారు..’ అని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ఏటా రాజీవ్ విద్యామిషన్ నుంచే ఈ ప్రశ్నపత్రాలు వస్తాయని, ఈ సారే కొత్తగా నిలిపివేయడం సరికాదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ తరగతులకు ప్రింటెడ్ ప్రశ్నపత్రాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు కోరుతున్నారు. స్థానికంగా అరుుతే జిరాక్స్‌లే.. ఈ ప్రశ్న పత్రాలను స్థానికంగా తయారు చేసుకుంటే విద్యార్థులకు సరిపడా జిరాక్స్‌లను మార్కెట్లో తీసుకోవాల్సిందే. ఈ జిరాక్స్ ప్రశ్న పత్రాలు మార్కెట్లో లభిస్తే.. పరీక్షల నిర్వహణ ఉత్తుత్తిగా మారనుందని, అలాంటప్పుడు పరీక్షలు నిర్వహించడం దేనికని పోషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇన్చార్జి ఎంఈవో సదుల చంద్రప్రకాశ్‌ను వివరణ కోరగా.. 6, 7, 8 తరగతుల మరాఠీ మీడియం సంగ్రహాత్మక పరీక్షలకు ప్రశ్నపత్రాలు సరఫరా కాలేదన్నారు. వీటిని ఆయూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తయారు చేసుకోవాలని రాజీవ్ విద్యామిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.