టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన
తలసాని ఇంటిముందు ధర్నా చేసిన టీఎన్ఎస్ఎఫ్ నేతల అరెస్టు
తీగల, మంచిరెడ్డి ఇళ్లకు వెళ్లకముందే నాయకుల అరెస్టు
హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని గురువారం రాత్రి మహబూబ్‌నగర్ సభ అనంతరం పార్టీ నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ప్లీనరీకి వెళ్లిన తరువాత వారిళ్ల ముందు ధర్నాలు చేయడం వల్ల పోలీసులు అడ్డుకోలేరని పార్టీ నేతలు భావించి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే విషయం ముందే తెలుసుకున్న పోలీసులు తెలుగుదేశం, టీఎన్ఎస్ఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివసించే మారేడ్‌పల్లి ఇంటికి ఉదయం వెళ్లిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు శరత్ చంద్రతో పాటు పలువురు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇంటి బారికేడ్లను దాటి లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నివసించే తిరుమల హిల్స్‌కు వెళ్లేందుకు ఆ నియోజకవర్గం ఇన్చార్జి వీరేంద్రగౌడ్, ఆయన అనుచరులు బయలుదేరగా మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసానికి వెళ్లేందుకు తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభారాణి తదితర మహిళా నాయకులు ప్రయత్నించగా, వారిని కూడా ఇంటికి వెళ్లకముందే అరెస్టు చేశారు. టీడీ ఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ నగర అధ్యక్షుడు సి. కృష్ణయాదవ్ తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారిని విడుదల చేయించారు. మలక్‌పేటలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే పోలీ సులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని శోభారాణి విమర్శించారు.