అతనో ‘కింగ్’
రియో, బ్రెజిల్ : అతను ఓ రాజు. శరవేగంగా కాలంతో పాటు ఉరుకుల పరుగుల జీవనానికి దూరంగా ఒంటరిగా నివసిస్తున్న వాడు. అతనే మార్సియో మిజయెల్ మటొలియస్. మార్సియో సామ్రాజ్యం చూడముచ్చటైనది. రియోలోని బర్రా డ టిజుకా బీచ్‌లో ఇసుకతో తన కోటను తనే నిర్మించుకున్నాడు మార్సియో. గత 22 ఏళ్లుగా అందులోనే జీవనం సాగిస్తున్నాడు. చుట్టుపక్కల నివసించే వారు మార్సియోను ‘ది కింగ్’ అని పిలుచుకుంటుంటారు.
ఇసుకతో నిర్మించుకున్న కట్టడం కూలిపోకుండా నీటితో రోజూ తడుపుతుంటానని మార్సియో ఓ మీడియా ప్రతినిధికి చెప్పాడు. ఎప్పటినుంచో ఇక్కడే జీవనం సాగిస్తున్నానని వివరించాడు. మిగిలినవారిలా ఉరుకుల పరుగుల జీవనం నుంచి దూరంగా ఉంటూ ప్రశాంతంగా హాయిగా ఉంటున్నట్లు తెలిపాడు.
బీచ్‌కు వచ్చే పర్యాటకులతో, ఇసుక కోట ముందు కూర్చొని ఫొటోలు దిగడం తన హాబీ అని వెల్లడించాడు. ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో స్నేహితుల ఇళ్లకు వెళ్తానని తెలిపాడు. ఈ జీవితం తనకు తృప్తినిస్తోందని చెప్పాడు. చిన్నవయసులో రియోకు చేరువలోని బే ఆఫ్ గ్వనాబరాలో నివసించినట్లు చెప్పాడు. బీచ్‌కు చేరువలో నివసించేందుకు చాలా ఖర్చు చేస్తారని, ఎలాంటి బిల్లులు లేకుండా బీచ్ ఒడ్డున నివసిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు. కోటకు పక్కనే బీచ్ గోల్ఫ్ కోర్సు, లైబ్రరీని నిర్మించుకున్నట్లు వెల్లడించాడు.