గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
చక్రాయపేట: చక్రాయ పేట మండలం మారెళ్ల మడక సమీపంలో లోతు వంక వద్ద సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మొలల వైద్యుడు గౌతమ్(32) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌతమ్ పదేళ్లుగా వేంపల్లిలో ఉంటూ మొలల వ్యాధికి వైద్యం చేస్తున్నారు. ఆదివారం భార్య రూపాతో కలిసి రాయచోటిలోని తన స్నేహితుని ఇంటికి వెళ్లారు. సోమవారం భార్య రూపాను అక్కడే వదలి తెల్లవారు జామున ఒక్కరే వేంపల్లికి మోటార్ బైక్‌పై బయలు దేరారు. మారెళ్ల మడక లోతు వంక సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లికి తరలించారు. మృతునికి భార్యతో పాటు 8నెలలు, 3 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అంత్యక్రియలకు రాని బంధువులు
గౌతమ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని పశ్చిమ బెంగాల్‌లోని తల్లికి, సోదరునికి తెలిపారు. కాని వారు కడు పేదవారు కావడంతో రాలేమని చెప్పారు. దీంతో వైస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహగౌడ్, నాయకులు బీయస్ షేక్షావలి, జిల్లా బలిజ సంఘం యూత్ అధ్యక్షుడు కటిక నాగరాజు తదితరులు పాపాఘ్ని నదిలో మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.