72 మందిని చంపడం కళ్లారా చూసి..
అది ఆఫ్రికాలోని బురండీ దేశం.. అక్టోబర్ 21, 1993.
దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఎటుచూసినా హింస రాజ్యమేలుతోంది. ఒకరినొకరు చంపుకుంటున్నారు. అంతటా భీతావహ వాతావరణం. టుట్సీ, హుతు వర్గాలకు మధ్య మొదలైన ఘర్షణ.. ఏకంగా 12 ఏళ్ల పాటు సాగింది. అత్యంత హింసాత్మకంగా సాగిన ఈ అంతర్యుద్ధంలో దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో అడుగు బయటపెట్టడానికే భయపడే పరిస్థితుల్లో టుట్సీ వర్గానికి చెందిన ఓ 59 ఏళ్ల మహిళ మాత్రం అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించింది. అంతర్యుద్ధంలో తల్లిదండ్రులు, ఆప్తులను కోల్పోయి అభాగ్యులుగా ఉన్న పిల్లలను అక్కున చేర్చుకుంది. చిన్నారులకు ఎలాంటి ఆపదా రాకుండా తానే రక్షణ కవచమై నిలిచింది. ఇందుకోసం ఎన్నోసార్లు ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. అలా దాదాపు 30 వేల మంది పిల్లలను కాపాడింది. చిన్నారులనే కాదు.. ఎంతోమంది శరణార్ధులకు కూడా ఆ మహిళ అండగా నిలిచింది. ఆమే మార్గురైట్ బరాంకిట్సే.
అంతర్యుద్ధం సమయంలో ఓ రోజు తన కళ్ల ముందు హుతు వర్గానికి చెందిన 72 మంది వ్యక్తులను చంపేయడం ఆమెను తీవ్రంగా కలిచి వేసింది. ఈ హింసను తాను ఆపలేకపోయినా ..అభాగ్యులకు, చిన్నారులకు బాసటగా నిలవాలని ఆమె అప్పుడే నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఎందరినో చేరదీశారు. అలా అప్పుడు మార్గురైట్స్ చూపిన ఔదార్యానికి ఇన్నేళ్ల తర్వాత గుర్తింపు లభించింది. ఆమెలోని మానవత్వానికి పురస్కారం దక్కింది. అభాగ్యుల కోసం జీవితాన్ని ధారపోసే వ్యక్తులకు ఇచ్చే 'అరోరా పురస్కారం' ను మార్గురైట్ కు ప్రదానం చేశారు. హాలీవుడ్ నటడు జార్జ్ క్లూనీ చేతుల మీదుగా గత ఏప్రిల్ లో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అన్నట్టు ఈ పురస్కారం కింద ఆమెకు లభించిన 10 లక్షల డాలర్లను కూడా ఛారిటీ కార్యక్రమాలకే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. బురుండీలో అంతర్యుద్ధం ముగిసిన మూడేళ్ల తర్వాత.. అంటే 2008 లో ఓ ఆస్పత్రి ప్రారంభించిన మార్గురైట్ ఇప్పటివరకు దాదాపు 80 వేల మందికి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ర్వండాలో ఉంటున్న ఆమె.. బురుండియా శరణార్ధుల కోసం సరిహద్దు వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు.