స్పానిష్ మూవీలో నందితాదాస్
ఉత్తరాదిన ఫైర్, ఎర్త్, దక్షిణాదిన అమృత, కమ్లి తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నందితాదాస్ ‘ఫిరాక్’తో దర్శకురాలిగా కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్న నందిత ఇటీవల ఓ స్పానిష్ మూవీని అంగీకరించారు.
ఇద్దరు అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పుడే విడిపోయే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది ప్రధానాంశం. ఈ చిత్రం షూటింగ్‌ని సగభాగం ముంబయ్, మిగతా భాగాన్ని బార్సిలోనాలో జరపనున్నారు. లేడీ డెరైక్టర్ మరియా రిపోల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
అక్కాచెల్లెళ్లు విడిపోయి, మళ్లీ కలుసుకునే చిత్రాలు చాలా వచ్చినా, కథనం వినూత్నంగా ఉంటుందని, సినిమాలోని మలుపు చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. అందుకే నందిత ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి సంబంధించి తెరవెనుక పనిచేసేవాళ్లందరూ ఆడవాళ్లేనట.