ప్రపంచంలోనే తొలి డిజిటల్ సమాధి
మారిబోర్: డిజిటల్ ప్రపంచంలో సమాధి రాళ్లు కూడా డిజిటల్ స్క్రీన్లుగా మారుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ సమాధి రాయి మధ్య యూరప్ దేశమైనా స్లొవేనియాలోని రెండవ అతిపెద్ద నగరమైన మారిబోర్ శ్మశానంలో వెలిసింది. 48 అంగుళాల ఈ డిజిటల్ స్క్రీన్‌పై మరణించిన వ్యక్తి డిజిటల్ చిత్రం, ఇతర వ్యక్తిగత వివరాలు ఉంటాయి. మున్ముందు మరణించిన వ్యక్తి జీవితానికి సంబంధించిన వీడియోలను కూడా ఈ స్క్రీన్‌పై చూడొచ్చు.
ప్రస్తుతం డిజిటల్ స్క్రీన్ సమాధి రాయితో సమాధిని ఏర్పాటు చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయలు అవుతుందట. మొదట చూడడానికి ఇది మామూలు గ్రానైట్ సమాధి రాయిగానే కనిపిస్తుంది. దాని ముందు ఎవరైనా కొన్ని క్షణాలపాటు నిలబడితే సెన్సర్ల ద్వారా అది డిజిటల్ స్క్రీన్‌గా మారిపోతుంది. ఈ డిజిటల్ స్క్రీన్‌పై పేరు, ఊరు, ఫొటోతోపాటు మొత్తం ఫొటో ఆల్బమ్‌ను ఏర్పాటు చేయవచ్చు. వాటిని ఎవరైనా చూడవచ్చు. అవసరమైతే చనిపోయిన వ్యక్తి జీవిత విశేషాలతో రాసిన ఓ నవలను కూడా పొందుపర్చవచ్చని ఈ డిజిటల్ సమాధి రాళ్లను అమ్ముతున్న బయోఎనర్జిజా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ సమాధి రాయిని మారిబోర్ నగరంలోని పోబ్రెజ్జీ శ్మశాన వాటికలో ఏర్పాటు చేశారు.
ఎవరైనా డిజిటల్ సమాధి రాయి ముందు నిలబడ్డప్పుడు మాత్రమే ఫొటో ఆల్బమ్, ఇతర వివరాలు కనిపిస్తాయని, ఎదురుగా లేనప్పుడు కేవలం మతుడి పేరు, చనిపోయిన తేదీ మాత్రమే కనిపిస్తుందని, ఇంధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టేందుకే ఈ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వివరించాయి. మున్ముందు వీడియో, ఆడియోలను ప్రదర్శించేందుకు వీలుగా దీనికి ఓ ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేస్తున్నామని చెప్పాయి. శ్మశానంతో మైకులు ఉపయోగించడం మంచిది కాదుకనుక ఇయర్ ఫోన్ల సౌకర్యం కల్పిస్తామని తెలిపాయి.