‘అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు’
►జూలై 4 నుంచి ప్రారంభం కానున్న 3 రోజుల పర్యటన
జెరూసలెం: ‘మేల్కొండి... ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు’ ఇదీ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ‘ ద మార్కర్’ చేసిన వ్యాఖ్య. భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథం ప్రచురించిన ద మార్కర్తన హిబ్రూ ఎడిషన్‌లో మోదీని ప్రశంసించింది.
మోదీ-ట్రంప్‌ను పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ చాలా ఆశించిందని, ఆయన ఎక్కువగా స్పందించలేదంది. 125 కోట్లమంది ప్రజల ఆదరణను పొందిన...ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నారని స్పష్టం చేసింది.
స్థానిక పత్రికలు, న్యూస్ పోర్టల్స్ సైతం మూడు రోజుల మోదీ పర్యటనకు చాలా ప్రాధాన్యతను ఇచ్చాయి. భారత్-ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 4 నుంచి ప్రారంభం కానున్న మోదీ మూడు రోజుల పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జూలై 5న టెల్ అవివ్‌లో భారత సంతతి ప్రజలు పాల్గొనే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు.