వాల్‌మార్ట్ ఇండియా విస్తరణ
వచ్చే 4-5 ఏళ్లలో 50 స్టోర్ల ఏర్పాటే లక్ష్యం
జిరాక్పూర్ (పంజాబ్): అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ సంస్థ అనుబంధ కంపెనీ వాల్‌మార్ట్ ఇండియా మార్కెట్ విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. వచ్చే 4-5 ఏళ్లలో భారత్‌లో కొత్తగా 50కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సప్లై చైన్ మౌలిక వసతుల వృద్ధికి సంబంధించిన వాటిల్లో తమ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగుతాయని వాల్‌మార్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజ్నీశ్ కుమార్ తెలిపారు. బీ2బీ విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నారు. ఈ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని (ఎఫ్‌డీఐ) 100 శాతానికి పెంచడం తమకెంతో ఉపకరిస్తుందని వివరించారు. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 20 స్టోర్లు ఉన్నాయి. 9 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాల్‌మార్ట్ ఇండియా తన తొలి స్టోర్‌ను 2009లో అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసింది.