మనీలాలో ఘోర అగ్ని ప్రమాదం
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని దక్షిణ మనీలా కు సమీపంలోని మార్కెట్ లో శనివారం ఘోర అగ్రి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పసివాళ్లు సహా 15 మంది సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాద కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
పోర్ట్ సిటీ జోబాంగో సమీపంలోని మార్కెట్ నుంచి ఎక్కువగా బట్టలు, కూరగాయలు ఎగుమతి అవుతాయి. ఈ క్రమంలోనే తమ సరుకులకు కాపలాగా వ్యాపారస్తులు కుటుంబాలతో షాపుల దగ్గరే నిద్రపోవడం మామూలు. తమ వస్తువులను ఎగుమతిచేసే నిమిత్తం మార్కెట్ భవనంలో నిద్రపోతుండగా ఈ ప్రమాదం సంభవించింది. హఠాత్తుగా మంటలు చుట్టుముట్టడంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడడంతో తప్పించుకోవడం కష్టంగా మారిందని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా ఫిలిప్సీన్స్ దేశంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు తరచూ సంభవిస్తాయని తెలుస్తోంది. గతంలో చెప్పుల పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.