హ్యాపీ బర్త్‌డే బరాత్!
ఆదర్శం
పుట్టిన రోజూ పండగే అందరికీ!
అందరికీనా?
అభాగ్యులకు మాత్రం అన్ని రోజుల్లాగే అదొక రోజు. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పూనుకుంటుంది. ఇదేమిటో తెలుసుకునే ముందు అభిజిత్ బాజ్‌పాయ్ గురించి తెలుసుకుందాం. ఈ మార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఢిల్లీలో ఒకరోజు కారులో వెళుతుంటే దూరంగా ఒక దృశ్యం కనిపించింది. కొందరు వీధిబాలలు చిరిగిపోయిన బర్త్‌డే క్యాప్లతో, ఖాళీ కేక్బాక్స్లతో ఆడలాడుకుంటున్నారు.
ఈ దృశ్యం అభిజిత్‌ను బాగా కదిలించింది.
‘‘పాపం ఈ పిల్లలకు బర్త్‌డేలు ఉండవు’’ అనుకున్నారు. ఆ రోజంతా ఆఫీసులో ఇదే విషయం గురించి ఆలోచించారు. ఇంటికి వెళ్లిన తరువాత తన ఆలోచనను భార్య సోనమ్‌తో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అలా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో అషిలా, లైలా అనే వీధి బాలల పుట్టిన రోజును ఒక వేడుకలా జరిపారు. తాము చేసిన పని గురించి ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టారు అభిజిత్. అద్భుతమైన స్పందన మొదలైంది.
‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పేరుతో ఒక బృందం తయారైంది. ఈ బర్త్‌డే బరాత్ వీధిబాలలకు పుట్టిన రోజు వేడుకలోని మాధుర్యాన్ని రుచి చూపిస్తుంది.
ఆ రోజు ఆ పిల్లలు ఆటలు ఆడతారు. పాటలు పాడుతారు. బర్త్‌డే కేకు కోస్తారు. కానుకలు తీసుకుంటారు. ఆ రోజంతా ఆనందంలో మునిగి తేలుతారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బరాత్ ఉద్దేశం డబ్బులు ఖర్చు చేయడం కాదు... వీధి బాలల కోసం కాస్త సమయాన్ని కేటాయించడం. ఆ కాసేపైనా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు కావడం’’ అంటున్నారు అభిజిత్.
వీధిపిల్లలకే కాదు... క్యాన్సర్ బాధిత పిల్లలకు కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంది ‘హాపీ బర్త్‌డే బరాత్’
‘హాపీ బర్త్‌డే బరాత్’ ఎందరికో స్ఫూర్తిని ఇస్తోంది. ఇప్పుడు ఢిల్లీలోనే కాదు పుణే, ముంబై, కోల్‌కతా, సూరత్, చెన్నై... మొదలైన ప్రధాన పట్టణాల్లో ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’లు జరుగుతున్నాయి. పేద పిల్లల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి.
‘‘ఈ పిల్లలకు తమ పుట్టిన తేదీ తెలియదు. వయసు తెలియదు.
ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు. బర్త్‌డే జరుపు కోలేదు. పుట్టిన రోజు పేరుతో మేము చేస్తున్న ఈ వేడుక వల్ల ఆ రోజు వారి కళ్లల్లో కనిపించిన సంతోషపు వెలుగును ఎప్పటికీ మరిచిపోలేం’’ అంటున్నాడు ముంబైకి చెందిన శరద్ జైన్.
‘‘మామూలు పిల్లలు ఎలాగైతే తమ బర్త్‌డే రోజు స్పెషల్‌గా ఫీలవుతారో... బర్త్‌డే బరాత్ రోజు వీధిబాలలు కూడా అలాగే ఫీలవుతారు.
ఆ సమయంలో వారి కళ్లల్లోని ఆనందాన్ని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది’’ అంటాడు కునాల్. ఆదివారం వచ్చిందంటే సినిమా హాళ్ల వైపు పరుగులు తీసే ప్రీతి పరేఖ్, సలోనీ వర్మలు తొలిసారిగా ‘హ్యాపీ బర్త్‌డే బరాత్ పార్టీ’కి హాజరయ్యారు. వారి స్పందన ఇలా ఉంది...
‘‘మా సన్డే ఫన్ డేగా మారిపోయింది. ఈసారి మేము కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉండదలుచుకోలేదు. మేము కూడా ఇలాంటి బర్త్‌డే పార్టీలు చేయాలనుకుంటున్నాం’’
ఈ వీధి బాలల్లో చాలామంది ఫుట్‌పాత్‌లు, చౌరస్తాల దగ్గర చిన్న చిన్న వస్తువులు అమ్ముతారు. బర్త్‌డే పార్టీ వల్ల వారికి వచ్చే చిన్న ఆదాయానికి నష్టం రాకుండా వారి చేతుల్లో ఉన్న వస్తువులను తామే కొనుగోలు చేస్తున్నారు ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ సభ్యులు.
విశేషమేమింటే ఈ బర్త్‌డే పార్టీలకు హాజరవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ‘‘బర్త్‌డే గురించి వినడమేగానీ ఇంతకు ముందు ఎప్పుడూ నా బర్త్‌డే జరుపుకోలేదు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కేకు ఎంతో రుచిగా ఉంది. ఈ రోజు నాకు చాలా మంచి రోజు’’ అంటున్నాడు రవి.
సిగ్నల్స్ దగ్గర బెలూన్లు, పూలు అమ్మడం ద్వారా రవి రోజుకు కనీసం వంద రూపాయలు సంపాదిస్తాడు. ఆ మొత్తం ఇవ్వడంతో పాటు రవికి కొత్త బట్టలు, షూస్ కొనిచ్చారు ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ సభ్యులు.
వీధి పిల్లలు, అనాథలు కేకు రుచి ఎప్పుడూ చూడకపోవచ్చు. అయితే ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పుణ్యమా అని తీయటి కేకు రుచి మాత్రమే కాదు... అంతకంటే తీయటి ‘ప్రేమ’ను రుచి చూస్తున్నారు!