మాఫీ చేయకుంటే సత్తా చూపుతాం
పుంగనూరు: తమ రుణాలు మాఫీ చేయకుంటే సత్తా చూపుతామని ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సంఘాల మహిళలు పుంగనూరులో శుక్రవారం ఆందోళనకు దిగారు. పుంగనూరు మున్సిపాలిటీలోని 2వ వార్డుకు చెందిన మార్కెట్‌యార్డు రోడ్డు, మేలుపట్ల రోడ్డు, దుళ్లవాళ్లఇండ్లకు చెందిన 18 ఐకేపీ సంఘాలకు చెందిన మహిళలు మున్సిపాలిటీలో రుణాలు పొందారు.
చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు రుణాలు రద్దు చేస్తారని ఆశపడ్డారు. రెండు నెలలు కావస్తున్నా రుణాల మాఫీపై ఉత్తర్వులు రాకపోవడంతో బ్యాంకు అధికారులు మహిళలను రుణాలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. దిక్కుతోచని మహిళలు శుక్రవారం మహిళా నేతలు రాజసులోచన, లక్ష్మిదేవి, రేష్మ, నాగరత్న, చిన్ని ఆధ్వర్యంలో సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కారణంగా తాము అధిక వడ్డీల బారిన పడుతున్నామన్నారు. పాత రుణాలు తీర్చడం లేదని ప్రస్తుతం బ్యాంకుల్లో ఇతర రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రుణాలు మాఫీ చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.