నౌకాదళ ప్రదర్శనకు పటిష్ట భద్రత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలో రెండోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన(ఐఎఫ్ఆర్) భద్రతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిం చింది. ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నేవీకి చెందిన మెరైన్ కమెండో దళం ‘మార్కోవ్స్’కు సముద్ర జలాలపై భద్రత బాధ్యతను అప్పగించారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు మార్కోవ్స్ బృందాలు సముద్రతలంపై గస్తీ కాయనున్నాయి. ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) ఉన్నతాధికారుల బృందం గురువారం విశాఖపట్నంలో పర్యటించింది.
నేవీ, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. భద్రతా ఏర్పాట్లను సమీక్షించింది. విశాఖపట్నంలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు నిర్వహించనున్న ఐఎఫ్ఆర్కు రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా 5 వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. 1.50 లక్షల మంది సాధారణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు.