Marriage group
-
వైస్ఆర్జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, 15 మందికి గాయాలు అయ్యాయి. కిష్టంపల్లి నుంచి కడపకు పెళ్లిబృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గాయాలతోనే తాళికట్టిన వరుడు
పెళ్లి బృందం ఆటో బోల్తా ⇒ ఏడుగురికి గాయాలు ⇒ సర్వాయిపేట వద్ద ఘటన కోటపల్లి/వేమనపల్లి: బుధవారం ఉదయం 10.30గంటలకు పెళ్లి. వరుడు తమ బంధుమిత్రులతో ఆటోలో వేకువజామున ఐదు గంటలకే బయల్దేరాడు. విధి వెంటాడింది. కాసేపట్లో పెళ్లి మంటపానికి చేరుకుంటామనగా.. 9.45గంటల ప్రాంతంలో కోటపల్లి మండలం సర్వాయిపేట వద్ద ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో పెళ్లి కుమారుడితోపాటు ఏడుగురు గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం వరుడు రక్తపుమరకలున్న బట్టలతోనే పెళ్లి మంటపానికి చేరుకుని వధువు మెడలో తాళికట్టాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన సుందిళ్ల మల్లేశ్‌కు వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ సమీపంలోని కాటెపల్లి గ్రామానికి చెందిన సీపెల్లి రాజక్క, ఎల్లయ్య దంపతుల కూతురు స్వరూపతో వివాహం కుదిరింది. బుదవారం ఉదయం 10.30గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. సంప్రదాయం ప్రకారం వధువు తరఫువారు పెళ్లి కుమారుడిని తీసుకు రావడానికి మంగళవారం రాత్రి ప్యాసింజర్ ఆటో పంపించారు. వధువు తరఫున లింగంపల్లి శంకరమ్మ, వడ్లకొండ బాయక్క, ఆసంపల్లి లచ్చక్క, సీపెల్లి వెంకటేశం, ఆటో డ్రైవర్ పున్నం వేలాల గ్రామానికి వెళ్లారు. వీరితోపాటు వేకువజామున ఐదు గంటలకు వరుడు మల్లేశ్, అతడి సోదరి వెంకటక్క ఆటోలో వధువు ఇంటికి బయల్దేరారు. సర్వాయిపేట బస్టాప్ వద్ద ఆటో ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లి బోల్తాకొడుతూ చెట్టుపై ఒరిగింది. ఆటోలో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. వరుడుతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురూ గాయపడ్డారు. వీరిని 108లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరుడు మల్లేశ్ ప్రథమ చికిత్స అనంతరం మరో ఆటోలో పెళ్లి మంటపానికి బయల్దేరాడు. వరుడి సోదరి వెంకటక్కకు తీవ్ర గాయాలు కాగా ఆమెతోపాటు శంకరక్క, బాయక్క, సీపెల్లి వెంకటేశంలను మంచిర్యాలకు తరలించారు. ఆటో డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. కాగా, ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.ప్రేమ్‌కుమార్ తెలిపారు. ముహూర్తం దాటినా వెరవని వరుడు ఉదయం 10.30గంటలకు పెళ్లి ముహూర్తం కాగా.. మార్గమధ్యంలో ప్రమాదం కారణంగా సమయం మించిపోయింది. చికిత్స పొంది చె న్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 11గంటలకు కాస్త తేరుకున్న వెంటనే వివాహం చేసుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. స్వయూన సోదరి గాయపడినా గుండె దిటవు చేసుకుని 11.10గంటల కు చెన్నూర్ ప్రభుత్వాస్పత్రి నుంచి బంధుమిత్రులతో కాటేపల్లికి మరో టాటా ఏస్ వాహనంలో చేరుకున్నాడు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వధువు మెడలో తాళికట్టాడు. -
ఆగదు నా పెళ్లి...
ప్రథమ ఘట్టం... పెళ్లి బృందం ఆటోలో వెళుతోంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు పెళ్లి. ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం సీతంపల్లిలో కల్యాణ వేడుక. పెళ్లి ముహూర్తానికి రెండు గంటల ముందు ఆ బృందానికి ప్రమాదం ఎదురైంది. సర్వాయిపేట వద్ద ఆటో బోల్తాపడింది. వరుడు. ఎస్.మల్లేశ్, మరో నలుగురికి గాయలు. స్థానికులు చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్వితీయ ఘట్టం... వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. సాధారణంగా పెళ్లికి ముందు ఇలా ప్రమాదం జరిగితే ముందుకు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ, ఇక్కడ మల్లేశ్ మాత్రం... ఏ ప్రమాదమూ తన పెళ్లిని ఆపలేదనే బలమైన సంకల్పంతో గాయాలకు కట్లు కట్టడం ఆలస్యం, బంధు వర్గంతో చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మరో ఆటోలో సీతంపల్లికి బయల్దేరాడు. ముహూర్తం దాటిపోయినా... పెళ్లి మాత్రం ఈ రోజే జరగాలని ఎంతో ఆశతో ముందడుగు వేశాడు. - కోటపల్లి (ఆదిలాబాద్) ప్రమాదంలో గాయపడిన పెళ్లి బృందం... -
లారీ- టవేరా కారు ఢీ; 12మందికి గాయాలు
గుంటూరు: జిల్లాలోని రొంపిచర్ల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఓ లారీ టవేరా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో టవేరా కారులో ప్రయాణిస్తున్న 12మంది గాయపడ్డారు. టవేరా కారులో పెళ్లిబృందం మాచర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.