గాయాలతోనే తాళికట్టిన వరుడు | Birdegroom to go his marriage after accident | Sakshi
Sakshi News home page

గాయాలతోనే తాళికట్టిన వరుడు

Published Thu, Apr 23 2015 2:39 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

గాయాలతోనే తాళికట్టిన వరుడు - Sakshi

గాయాలతోనే తాళికట్టిన వరుడు

పెళ్లి బృందం ఆటో బోల్తా
ఏడుగురికి గాయాలు
సర్వాయిపేట వద్ద ఘటన
కోటపల్లి/వేమనపల్లి: బుధవారం ఉదయం 10.30గంటలకు పెళ్లి. వరుడు తమ బంధుమిత్రులతో ఆటోలో వేకువజామున ఐదు గంటలకే బయల్దేరాడు. విధి వెంటాడింది. కాసేపట్లో పెళ్లి మంటపానికి చేరుకుంటామనగా.. 9.45గంటల ప్రాంతంలో కోటపల్లి మండలం సర్వాయిపేట వద్ద ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో పెళ్లి కుమారుడితోపాటు ఏడుగురు గాయపడ్డారు.

ప్రథమ చికిత్స అనంతరం వరుడు రక్తపుమరకలున్న బట్టలతోనే పెళ్లి మంటపానికి చేరుకుని వధువు మెడలో తాళికట్టాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన సుందిళ్ల మల్లేశ్‌కు వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ సమీపంలోని కాటెపల్లి గ్రామానికి చెందిన సీపెల్లి రాజక్క, ఎల్లయ్య దంపతుల కూతురు స్వరూపతో వివాహం కుదిరింది. బుదవారం ఉదయం 10.30గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది.
సంప్రదాయం ప్రకారం వధువు తరఫువారు పెళ్లి కుమారుడిని తీసుకు రావడానికి మంగళవారం రాత్రి ప్యాసింజర్ ఆటో పంపించారు. వధువు తరఫున లింగంపల్లి శంకరమ్మ, వడ్లకొండ బాయక్క, ఆసంపల్లి లచ్చక్క, సీపెల్లి వెంకటేశం, ఆటో డ్రైవర్ పున్నం వేలాల గ్రామానికి వెళ్లారు. వీరితోపాటు వేకువజామున ఐదు గంటలకు వరుడు మల్లేశ్, అతడి సోదరి వెంకటక్క ఆటోలో వధువు ఇంటికి బయల్దేరారు. సర్వాయిపేట బస్టాప్ వద్ద ఆటో ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లి బోల్తాకొడుతూ చెట్టుపై ఒరిగింది. ఆటోలో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు.

వరుడుతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురూ గాయపడ్డారు. వీరిని 108లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరుడు మల్లేశ్ ప్రథమ చికిత్స అనంతరం మరో ఆటోలో పెళ్లి మంటపానికి బయల్దేరాడు. వరుడి సోదరి వెంకటక్కకు తీవ్ర గాయాలు కాగా ఆమెతోపాటు శంకరక్క, బాయక్క, సీపెల్లి వెంకటేశంలను మంచిర్యాలకు తరలించారు. ఆటో డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. కాగా, ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.ప్రేమ్‌కుమార్ తెలిపారు.
 
ముహూర్తం దాటినా వెరవని వరుడు
ఉదయం 10.30గంటలకు పెళ్లి ముహూర్తం కాగా.. మార్గమధ్యంలో ప్రమాదం కారణంగా సమయం మించిపోయింది. చికిత్స పొంది చె న్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 11గంటలకు కాస్త తేరుకున్న వెంటనే వివాహం చేసుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. స్వయూన సోదరి గాయపడినా గుండె దిటవు చేసుకుని 11.10గంటల కు చెన్నూర్ ప్రభుత్వాస్పత్రి నుంచి బంధుమిత్రులతో కాటేపల్లికి మరో టాటా ఏస్ వాహనంలో చేరుకున్నాడు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వధువు మెడలో తాళికట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement