లింగమార్పిడి వివాహాలకు ఓకే చెప్పిన ఫత్వా!
సాధారణంగా ఫత్వా అంటే అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అనే ఆదేశాలే చూస్తుంటాం. కానీ, పాకిస్థాన్లో లింగమార్పిడి చేయించుకున్న వాళ్ల పెళ్లిళ్లను చట్టబద్ధం చేస్తూ 50 మంది మతపెద్దలు ఫత్వా జారీచేశారు. ‘తన్జీమ్ ఇత్తెహాద్ ఇ ఉమ్మత్’కు చెందిన మతగురువులు ఈ ఫత్వాను విడుదల చేశారు. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత.. చూసేందుకు మగవాడిలా కనిపించే వాళ్లు ఒక మహిళను గానీ, లింగమార్పిడితో మహిళలా కనిపించే వాళ్లను గానీ పెళ్లి చేసుకోవచ్చని ఈ ఫత్వాలో తెలిపారు. అయితే, ఇద్దరి లక్షణాలు కనిపించేవాళ్లు మాత్రం ఎవరినీ పెళ్లి చేసుకోడానికి వీల్లేదట.
అలాగే, లింగమార్పిడి చేయించుకున్న పిల్లలకు వారసత్వంగా వచ్చే ఆస్తిలో హక్కును నిరాకరించడం కూడా తగదని.. అలా చేస్తే దేవుడి ఆగ్రహానికి గురవుతారని ఫత్వాలో పేర్కొన్నారు. ఇలాంటి తల్లిదండ్రులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. లింగమార్పిడి చేయించుకున్న వారిని అవమానించడం, టీజ్ చేయడం దారుణమైన నేరమని కూడా తెలిపింది. ఇతర ముస్లిం పురుషులు, మహిళలకు ఉన్నట్లుగానే లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా అంత్యక్రియలు చేయించాలన్న వాక్యంతో ఈ ఫత్వా ముగిసింది.