నిజామాబాద్‌లో వివాహితపై గ్యాంగ్ రేప్?
నిజామాబాద్ క్రైం: నిజామాబాద్‌లో ఓ మహిళపై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బోధన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలసి ఆదివారం రాత్రి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో నిజామాబాద్‌కు చేరుకుంది. బోధన్‌కు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో స్టేషన్లోనే ఉండిపోయారు. రాత్రి ఆకలి బాధ తీర్చుకునేందుకు స్టేషన్ బయటకు వస్తుండగా నలుగురు యువకులు భర్తను కత్తితో బెదిరించి, ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె వద్ద ఉన్న రూ.1,600 నగదును దోచుకున్నారు. దుస్తులు చిరిగి పోవడంతో ఆ మహిళ అక్కడే నైటీ వేసుకుంది.
అనంతరం భార్యభర్తలు.. నలుగురు యువకులతో వాగ్వాదానికి రోడ్డుపైకి వచ్చారు. అటువైపు వెళ్తున్న రైల్వే కానిస్టేబుల్ వారి వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. తనపై గ్యాంగ్‌రేప్ జరిగిందని, ఈ ఇద్దరు యువకులు ఉన్నారంటూ వెనుక నుంచి వస్తున్న వారిని చూపించింది. ఆ కానిస్టేబుల్ ఇద్దరిని పట్టుకోగా, మరో ఇద్దరి పారిపోయారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో గోవర్దన గిరి వచ్చి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
పలు అనుమానాలు..
రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి రైలు దిగిన భార్యభర్తలు స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రధాన మార్గం ఉండగా చెట్లపొదల నుంచి రావడం.. పోలీసుల విచారణలో ఆమె పొంతన లేని సమాధానం చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు పరీక్షలు జరిపి.. వారు సేకరించిన నమునాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిందని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మహిళ సంఘాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. సదరు మహిళ పొంతన లేని సమాధానం చెప్పడంతో వారు వెనుతిరిగి వెళ్లిపోయారు.