దేశ రక్షణలో యువత ముందుండాలి
- ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహ
- ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందిన క్యాడెట్లకు పాసింగ్ అవుట్ పరేడ్
జిన్నారం: ఎయిర్ ఫోర్స్ అకాడమిలోని వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లు దేశ రక్షణలో భాగస్వాములు కావాలని, యువత దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్‌రాహ పిలుపునిచ్చారు. శనివారం మెదక్, రంగారెడ్డి జిల్లాలోని సరిహద్దులో గల దుండిగల్ ఎయిర్స్ అకాడమీలో ఆరు నెలలుగా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లకు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరూప్‌రాహ హాజరయ్యారు. శిక్షణ పొందిన క్యాడెట్ల నుంచి అరూప్‌రాహ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆరు నెలలుగా వివిధ రంగాల్లో 193 మంది క్యాడెట్లు శిక్షణను పూర్తి చేసుకున్నారు. వీరిలో 41మంది మహిళా క్యాడెట్లు ఉన్నారు. శిక్షణ పొందిన క్యాడెట్లు మార్చ్ఫాస్ట్ను నిర్వహించారు. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన అనిల్‌కుమార్‌ను ‘స్వార్డ్‌ఆఫ్ హానర్’గా గుర్తించి అరూప్‌రాహ ఆయనకు ఖడ్గ ధారణ చేశారు.
గ్రౌండ్ డ్యూటీస్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన దుర్గేష్‌కుమార్, నావిగేషన్ కోర్సులో ప్రతిభ కనబర్చిన సతీష్కుమార్లకు అరూప్‌రాహ మెమొంటోలను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరూప్‌రాహ క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడారు. గత ఆరు నెలలుగా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లు దేశం కోసం సేవ చేయాలని పిలుపునిచ్చారు. యువతులు, యువకులు ఈ శిక్షణలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. నిస్వార్థంగా దేశానికి సేవలందించాలన్నారు. అనంతరం చేతక్ హెలిక్యాప్టర్, సుఖోయ్ యుద్ధ విమానాలు చేసిన పలు విన్యాసాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.