వంటనూనెల దిగుమతి తగ్గించుకోవాలి
ఏడీఎం ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ మార్టిన్ క్రాప్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో ఆహారంతో పాటు ఆరోగ్యానికీ దోహదపడే సోయాబీన్ దిగుబడులు క్రమేపీ తగ్గిపోతుండటం మంచి పరిణామం కాదని ఏడీఎం ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ మార్టిన్ క్రాప్ అన్నారు. కోట్లు ఖర్చు చేస్తూ వంట నూనెలను దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో వాణిజ్య లోటు ఏర్పడుతోందన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో శనివారం సోయాబీన్ నూనె ఉపయోగాలపై జరిగిన జాతీయ సదస్సుకు మార్టిన్ హాజరయ్యారు.
యునెటైడ్ స్టేట్స్ సోయ్ ఎక్స్‌పోర్ట్స్ కౌన్సిల్ (యూఎస్ఎస్ఈసీ), ఆయిల్ టెక్నాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏటా 2 కోట్ల టన్నుల వంటనూనెలను ఉపయోగిస్తూంటే.. వీటిల్లో 65 శాతం దిగుమతులే ఉంటున్నాయని చెప్పారు. యూఎస్ఎస్ఈసీ ఉన్నతాధికారి డాక్టర్ ఎం.ఎం.కృష్ణ మాట్లాడుతూ.. సోయా నూనెలో ఉండే ఒమేగా 3, 6, 9 కొవ్వులు గుండెకు మేలు చేస్తాయన్నారు.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు పామాయిల్, సోయా నూనెలను కలిపి వాడటం మంచిదని ఐఐసీటీలోని సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ విభాగ అధిపతి డాక్టర్ ఆర్.బి.ఎన్. ప్రసాద్ తెలిపారు. ఇకపై సోయా పప్పును కూడా చూడబోతున్నామని, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు తెలిపారు.