ప్రేమ పేరుతో పదేళ్ల పాటు అత్యాచారం..
బీదర్: మాయ మాటలు చెప్పి, ప్రేమ పేరుతో ఓ బాలికపై పదేళ్లపాటు లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి కర్ణాటకలోని బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఐదువేల రూపాయల జరిమానా విధించింది. అంతేగాక నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితురాలికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జిల్లా యంత్రాగాన్ని ఆదేశించింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.
2002లో బీదర్ జిల్లాలోని ఔరద్ పట్టణంలో మారుతి ఆమ్రెప్ప (34) అనే వ్యక్తి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కు ఎస్డీఎమ్సీ చైర్మన్గా పనిచేశాడు. ఆ సయమంలో 8వ తరగతి చదువుతున్న బాలికను మారుతి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. అప్పటికే అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా, ఈ విషయాన్ని దాచిపెట్టి విద్యార్థిని పెళ్లి చేసుకుంటానని ఆమె కుటుంబ సభుల్ని నమ్మించాడు. పైచదువుల కోసమని ఆ బాలికను మంగళూరుకు పంపాడు. అక్కడ ఓ ఇల్లు తీసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మారుతిని ఆ బాలిక ప్రేమించడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లికి అడ్డుచెప్పలేదు.
ఆ తర్వాత ఇద్దరూ కలసి జీవించారు. అమ్మాయి తొమ్మిది సార్లు గర్భవతి కాగా, మారుతి బలవంతంగా ప్రతిసారి అబార్షన్ చేయించాడు. పదో సారి ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టడం ఇష్టంలేని మారుతి బిడ్డను అనాథశరణాలయానికి ఇచ్చాడు. 2012లో ఆ అమ్మాయి గర్భవతి కాగా, అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అబార్షన్ చేయించుకునేందుకు ఆమె నిరాకరించడంతో మారుతి ఇంటి నుంచి గెంటేశాడు. బాధితురాలి ఔరద్లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారించిన న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది.