9 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
28 దుంగలు, వాహనాల స్వాధీనం
నిందితుల్లో ఓ టీవీ చానల్ రిపోర్టర్
మరో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు లో చిత్తూరు పోలీసులు తొమ్మిది మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువ జేసే మారుతి సిఫ్ట్ కారు, టాటా సఫారి వాహనం, ఆటో, మోటారు సైకిల్, 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నిం దితుల వివరాలను ఆదివారం స్థానిక పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కేవీ పల్లె సమీపంలోని దేవావాండ్లవూరు వద్ద శనివారం సా యంత్రం పోలీసులు తనిఖీచేస్తుండగా నింది తులు టాటా సఫారి, మారుతి సిఫ్ట్ కార్లలో కర్ణాటకకు ఎర్రచందనం తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటో, మోటార్సెకిల్ పెలైట్ వాహనాలుగా వెళుతూ పట్టుబడ్డాయి. ఈ సమావేశంలో ఓఎస్డీ రత్న, పీలేరు డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ నరసింహులు సైతం పాల్గొని నిందితుల నేర చరిత్రను వివరించారు. అరెస్టయిన వారిలో ఓ టీవీ చానల్ రిపోర్టర్, డిగ్రీ చదివే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి.
విష్ణువర్థన్... ఓ రిపోర్టర్: సదుం మండలం చింతలవారిపల్లెకు చెందిన డి.విష్ణువర్థన్‌రెడ్డి తిరుపతి నగరంలోని ఓ తెలుగు టీవీ ఛానల్లో రిపోర్టర్‌గా పనిచేసేవాడు. తొలుత తిరుపతిలో హోటల్లో పనిచేస్తూ జల్సాలను అటువాటుపడ్డాడు. అనంతరం ఓ తెలుగు టీవీ చానల్లో రిపోర్టర్‌గా చేరాడు. రిపోర్టర్‌గా ఉంటూ ఆరు నెలలుగా కేవీ పల్లె, భాకరాపేట ప్రాంతాల్లో తక్కువ ధరకు ఎర్రచందనం తీసుకుని కర్ణాటకలోని కటికనహల్లి, బెంగళూరుకు తరలించేవాడు.
పురుషోత్తం: రొంపిచెర్ల మండలం, గానుగచింతకు చెందిన కె.పురుషోత్తం తొలుత ఎర్రచందనం పైలట్‌గా, ఇన్ఫార్మర్గా పనిచేసేవాడు. ఇందులో పెద్దగా గిట్టుబాటు కాకపోవడంతో ఎర్రచందనం స్మగ్లర్‌గా మారాడు. పలువురు యువకుల్ని ఈ రొచ్చులోకి లాగి వ్యాపారం చేయడం నేర్పించాడు. ఇతనిపై పీలేరులో 5, రొంపిచెర్ల పోలీసు స్టేషన్లో ఒక కేసు ఉంది. రొంపిచెర్ల పోలీసు స్టేషన్లో ఇతనిపై రౌడీషీట్ కూడా ఉంది.
చరణ్‌కుమార్‌రెడ్డి: కేవీ పల్లె మండలం మల్లువారిపల్లెకు చెందిన ఎ.చరణ్‌కుమార్‌రెడ్డి పీలేరులోని ఓ కళాశాలలో డిగ్రీ (బీకామ్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి ఎర్రచందనం వాహనాలకు పెలైట్‌గా, ఇన్ఫార్మర్గా పనిచేయడం ప్రారంభించాడు. అనతరం ఎర్రచందనాన్ని తక్కువ ధరకు కొని ఎక్కువ రేటుకు అమ్మడం మొదలుపెట్టాడు. ఇతని స్నేహితులు చాలా మందిని ఈ వ్యాపారంలోకి దించాడు. ఇతనిపై రొంపిచెర్ల స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి.
దేవేందర్‌రెడ్డి: సదుం మండలం తాటిగుంటపాలెంకు చెందిన దేవేంద్రరెడ్డి ఇదే మండలానికి చెందిన రాజేష్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. పెలైట్, ఇన్ఫార్మర్గా కూడా పనిచేశాడు. దీంతో పాటు పీలేరు, సదుం, రొంపిచెర్ల మండలాల్లో పలు కాంట్రాక్టు పనులు కూడా చేసేవాడు.
మహబూబ్ జీనన్: పీలేరులోని ఓ కళాశాలలో మహబూబ్ జీనన్ డిగ్రీ (బీకామ్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మహబూబ్జీనన్, చరణ్‌కుమార్‌రెడ్డి క్లాస్మేట్లు. ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్ చేయడానికి వాహనాలను సమకూర్చి, పైలట్‌గా పనిచేసేవాడు.
తారకనాథరెడ్డి: కేవీ పల్లె మండలం గంటావారిపల్లెకు చెందిన తారకనాథరెడ్డి ఎర్రచందనం వాహనాలకు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతనిపై భాకరాపేట, కేవీ పల్లె పోలీసు స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి.
సి.చంద్రయ్య: వైఎస్సార్ జిల్లా టి.సుండుపల్లెకు చెందిన సి.చంద్రయ్య ఎర్రచందనం స్మగ్లర్ మహేష్‌నాయుడు బంధువు. ఎర్రచందనం గోడౌన్ల ఇన్చార్జ్గా ఉంటూ ఎర్రచందనం దుంగల్ని రహస్య ప్రదేశాల్లో ఉంచేవాడు.
పి.రవి: రొంపిచెర్ల మండ లం గానుగచింతకు చెంది న పి.రవి అడువులకు వెళ్లి తానే ఎర్రచందనం చెట్లను నరికి తీసుకొచ్చి భాకరాపేట, రొంపిచెర్లలో ఉన్న స్మగ్లర్లకు అమ్ముతాడు.
పి.సుధాకర్: రొంపిచెర్ల మండలం గానుగచింతకు చెందిన సుధాకర్ అదే ప్రాంతానికి చెందిన పురుషోత్తంరెడ్డి అనే ఎర్రదొంగకు ముఖ్య అనుచరుడు. ఇతడు కూడా అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికి తీసుకొచ్చి భాకరాపేట, రొంపిచెర్లల్లో ఉన్న స్మగ్లర్లకు విక్రయించేవాడు.