మారుతి ఎస్యూవీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా వచ్చే ఏడాది స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. 2012 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కాన్సెప్ట్ కారు ఎక్స్ఏ ఆల్ఫా ఆధారంగా ఇది రూపుదిద్దుకుంటోందని సమాచారం. కాన్సెప్ట్ కారు పొడవు 4 మీటర్లు, వెడల్పు 1.9 మీటర్లు, ఎత్తు 1.6 మీటర్లు ఉంది.
ఇటువంటి చిన్న ఎస్‌యూవీని వితారా పేరుతో వచ్చే ఏడాది యూరప్‌లో విడుదల చేసేందుకు సుజుకి మోటార్ సమాయత్తమవుతోంది. అయితే భారత్‌లో విడుదలయ్యే ఎస్యూవీ, వితారా ఒకటేనా అన్నదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కారు కంటే ముందుగా క్రాస్ఓవర్ మోడల్ అయిన ఎస్ఎక్స్4 ఎస్ క్రాస్‌ను 2015 జూన్ ప్రాంతంలో భారత మార్కెట్లోకి తీసుకు రానుంది. కాగా, ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీకి దేశంలో డిమాండ్ పెరుగుతోంది. రాబోయే అన్ని మోడళ్లను ఈ టెక్నాలజీతో తీసుకురానున్నట్టు మారుతి సుజుకి తెలిపింది.
కొత్త ప్రమాణాలతో...
నూతన భద్రత ప్రమాణాలు 2017లో భారత్‌లో అమలయ్యే అవకాశం ఉందని మారుతి సుజుకి ఇండియా ఇంజనీరింగ్ విభాగం ఈడీ సి.వి.రామన్ తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో ఆల్టో కె10ను ఆవిష్కరించిన అనంతరం రీజినల్ మేనేజర్ మునీష్ బాలితో కలసి మీడియాతో మాట్లాడారు. నూతన ప్రమాణాలు అమలైతే కార్ల ఖరీదు కనీసం రూ.15 వేలు అధికమవుతుందని ఆయన చెప్పారు. చిన్న కారును కొనేవారికి ఇది భారమేనని పేర్కొన్నారు.
ప్రమాణాలకు తగ్గట్టుగా తమ కంపెనీ ఏర్పాట్లు చేసుకుంటోందని వివరించారు. గ్లోబల్ ఎన్సీఏపీ భద్రత పరీక్షల్లో స్విఫ్ట్ కారు విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై రామన్ స్పందిస్తూ భారత్‌తోపాటు తాము వ్యాపారం చేస్తున్న దేశాలకు అనుగుణంగా కార్ల భద్రత ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. ఎన్సీఏపీ నివేదిక స్విఫ్ట్ కార్ల అమ్మకాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని రామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.