ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మారుతీ వ్యాన్..ఇద్దరు పాస్టర్ల దుర్మరణం
కోదాడటౌన్, న్యూస్‌లైన్: ప్రార్థనల కోసం వెళ్లిన పాస్టర్లు గమ్యం చేరకుండానే అనంతలోకాలకు చేరుకున్నారు. కోదాడ పరిధిలోని దుర్గాపురం క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాల య్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు చెందిన నలుగురు పాస్టర్లు గుంటూరులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. సోమవారం రాత్రి మారుతీ వ్యాన్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. వైజాగ్ నుంచి వస్తున్న లారీని డ్రైవర్ దుర్గాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆపి కాలకృత్యాల కోసం దిగాడు.
ఇది గమనించని మారుతీ వ్యాన్‌డ్రైవర్ ఈ లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో వ్యాన్ నుజ్జునుజ్జు కాగా మహబూబ్‌నగర్‌లోని పాలమూర్ కాలనీకి చెందిన సూరమ్మ (65), జయాకర్ (46) అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన ఆశీర్వాదం, లలితకుమారిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిం చారు. మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆశీర్వాదం సోదరుడు బాబురావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ సీఐ మధుసూదన్ తెలిపారు.