గ్రూప్–2పై అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
గుంటూరు వెస్ట్ : గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఆదివారం జరిగిన గ్రూప్–2 ఉచిత అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 1000 మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఏ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్పష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదవడం మినహా మరో మార్గం లేదన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఛైర్మన్ పాశం రామారావు మాట్లాడుతూ జాషువా ఆశయాలను కొనసాగించేందుకు విజ్ఞానకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముద్రించిన గ్రూప్–2 మెటీరియల్‌ను వీసీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ మెటీరియల్‌ను అభ్యర్థులకు ఉచితంగా అందజేశారు.
ప్రణాళికాబద్ధంగా చదివితేనే..
మాజీ ఎంఎల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయని, ప్రణాళికాబద్ధంగా చదువుకుని విజయం సాధించాలని అభ్యర్థులకు సూచించారు. ఖాళీగా ఉన్న 5 వేల పోస్టులను భర్తీ చేయాలని, నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రిలిమినరీ పరీక్షా విధానం ఆలోచనను విరమించుకోవాలని కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ప్రవేశపెట్టే విధానాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందిగా ఉండబోతున్నాయన్నారు. ఆ విధానాలపై తాము చేసే ఆందోళనలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఉద్యోగ సోపానం ఎడిటర్ ఎస్.వి.సురేష్, సబ్జెక్టు నిపుణులు మునిస్వామి, బి.మల్లికార్జునరావు, షేక్ ఇస్మాయిల్, కుర్రా శ్రీనివాస్, ప్రణయ్‌కుమార్ తదితరులు పరీక్షల సిలబస్ తదితరాలు వివరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బీ.లక్ష్మణరావు, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఛైర్మన్ పిన్నమనేని మురళీకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీ.భగవాన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.