Marxists
-
శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) విజయం సాధించారు. దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో ఫలితం తేలడం విశేషం. జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయకే తన సమీప ప్రత్యరి్థ, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలి గారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.ఏకేడీ.. ఎట్టకేలకు! ఏకేడీగా పిలుచుకునే అనూర దిస్సనాయకే నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లోని థంబుట్టెగామలో జన్మించారు. కొలంబో సమీపంలోని కెలనియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు. 1987లో జేవీపీలో చేరారు. 1971, 1987, 1990ల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు జేవీపీ హింసా మార్గం తొక్కింది. ఇది భారత వ్యతిరేకి కూడా. అప్పట్లో రాజీవ్ గాం«దీ–జయవర్థనే ప్రభుత్వాల ఒప్పందం శ్రీలంక సార్వ¿ౌమత్వానికి భంగకరమని భావించేది. గత ఫిబ్రవరిలో దిస్సనాయకే భారత్‌లో పర్యటించాక పార్టీ వైఖరిలో మార్పువచి్చంది. 90ల్లో జేవీపీ ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పారీ్టలో దిస్సనాయకేకు ప్రాధాన్యం పెరిగింది. 2000 ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు. 2014లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 2019 ఎన్నికల్లో జేవీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతమే. -
కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు: మహాస్వప్న
దిగంబరులారా, అజ్ఞానం మీ కవచం, అహంకారం మీ ఆయుధం, ఆత్మవంచన, పరవంచన మీకు కొత్తగా మొలిగచిన కొమ్ములు. దౌర్జన్యం మీ పంథా. మీకు ఎదురు లేదు. దిగ్విజయం మీదే. ఎందుకంటే చరిత్ర నిండా కనిపించే విజేతలంతా మీలాంటి వాళ్లే. మీకు ఎక్కడా, ఎప్పుడూ సందేహాలు లేవు. సమస్యలు లేవు. మీకు ప్రశ్నలు లేవు. ఉన్నా వాటికి సమాధానాలక్కరలేదు. మీరు ప్రపంచ ఏకైక సత్యాన్ని దర్శించిన ద్రష్టలు. కేవలం జ్ఞాన స్వరూపులు. మీ జ్ఞానాధిక్యత పట్ల మీకున్న ప్రగాఢ విశ్వాసం ప్రశస్తం. నిజంగా మీరు గొప్పవారు. మీ ‘ప్రజలు’ గొప్పవారు. మీ జెండాలు గొప్పవి. మీ నినాదాలు గొప్పవి.మీ విశ్వాసాలు గొప్పవి. మీరు కనుక్కున్న సత్యం గొప్పది. మీరు తొడుక్కున్న పందొమ్మిదో శతాబ్దపు ఐరోపా కోటు (చిరిగి, మాసి, అంతులేని గబ్బు కొడుతున్నా సరే) గొప్పది. ఎదుటి వాడిని చిత్తు చేయడం కోసం వేసిన ఎత్తుగడలు గొప్పవి. పన్నిన వ్యూహాలు గొప్పవి. అందుకే మీరు నిజంగా గొప్ప వారు. నేను జీవితంలోకీ, సాహిత్యంలోకీ దిగంబరంగానే వచ్చాను. ఆయుధాలు సిద్ధం చేసుకోలేదు. యుద్ధానికి రాలేదు కాబట్టి. నేను చిన్నవాణ్ణి, కొద్దివాణ్ణి. నాకు అన్నీ సమస్యలే. అన్నీ సందేహాలే. నాకెదురుగా అన్నీ చౌరస్తాలే. అన్నీ క్రాస్ రోడ్లే. ముఖ్యంగా ఈ దేశంలో ఎవరు ఎవరో తెలుసుకోవడం కష్టం. ఎవరు ఏ పనిచెయ్యాలో ఆ పని చేయరు. ఎవరు ఏ పని చెయ్య కూడదో ఆ పని చేస్తారు. ఇక్కడ కుక్కలు ఓండ్రపెడతాయి. గాడిదలు మొరుగుతాయి. గొర్రెలు గర్జిస్తాయి. సింహాలు ఇకిలిస్తాయి. అందుకే ఒక క్యాపిటలిస్టు మార్క్సిజాన్ని గురించి మహోపన్యాసం ఇచ్చినా, ఒక నపుంసకుడు బండ్ల కొద్దీ సెక్స్ సాహిత్యాన్ని సృష్టించినా, ఒక పరమ దుర్మార్గుడు పరమ శివుడి ఫోజు పెట్టినా ఆశ్చర్యపడనక్కరలేదు. ‘వర్గపోరాటం–వర్గ సంఘర్షణ’ అంటున్న మీరూ, మీ ప్రజలూ ఏ వర్గానికి చెందుతారో మీకు తెలీదు. మావో మ్యాజిక్కుకి వొళ్లు మరిచి కదం తొక్కతూ కదనకుతూహలంతో సాయుధ విప్లవం పదం పాడుతున్న మీకు, అర్జెం టుగా శత్రువులు కావలసిన మాట నిజమే. ఉన్న పిడికెడు మంది శత్రువులు మీ పిడికెళ్ల కెట్లాగూ అందరు. ఈ చీకటి తిర్నాళ్ల సంతలో మిగతా నిజమైన శత్రువుల అడ్రసేదో మీకు అంతుపట్టదు. అజ్ఞానంతో, ఆవేశంతో ‘సాయుధ విప్లవం జిందాబాద్’ అని మీరంటే లక్ష దోపిడీ కంఠాలు మీ వెనుక నుంచి ‘జిందా బాద్’ అని ప్రతిధ్వనిస్తున్నాయి. ‘నక్సలైట్ తత్వం వర్థిల్లాలి’అని మీరంటే ‘వర్థిల్లాలి’ అని లక్ష దోపిడీ హస్తాలు పైకి లేస్తున్నాయి. మీ అజ్ఞానాన్ని మీ ప్రజలూ, మీ ప్రజల అజ్ఞానాన్ని మీరూ దోపిడీ చేసుకుంటున్నారు. నిజం తెలుసుకోవాలనుకుంటే నిశ్శబ్దంగా సమాజ జీవనాడుల్లోకి ప్రవహించండి. కవిత్వం కావాలనుకుంటే సిద్ధాంతాల్ని, సూత్రాల్ని తెగదెంచి, ముందు మిమ్మల్ని మీరు బంధ విముక్తుల్ని చేసుకోండి. కవిగా నేనెప్పుడూ సర్వస్వతంత్రుడినే. వ్యక్తి స్వేచ్ఛను అంటే భావస్వాతంత్య్రాన్ని అరికట్టే ఏ వ్యవస్థనయినా, ఏ ఉద్యమాన్నయినా ద్వేషిస్తాను, దూషిస్తాను. శాసించే ప్రతి దౌర్జన్య హస్తాన్నీ నిలబెట్టి నరుకుతాను. ‘కట్టుబడు’ అంటే తంతాను. ఆత్మహననం కానంతవరకే సమష్టి బాధ్యతకు విలువ. మార్క్సిజం మీ సొంతమైనట్లు వాదిస్తున్న మీ అజ్ఞానానికి, ఇతర ఇజాలనూ, ఇతర కవులనూ సహృదయతతో, సానుభూతితో చూడలేని మీ బుద్ధి జాఢ్యజనితోన్మాదానికీ విచారిస్తున్నాను. మీరు నటిస్తున్న మాట యథార్థం. మీ సిన్సియారిటీని నేను శంకిస్తున్నాను. నక్సల్బరిలో ఏనాడో మొదలైన రైతు పోరాటం ఆంధ్రప్రదేశ్‌కు వ్యాపించి శ్రీకాకుళంలో మంటలు మిన్ను ముట్టాకనే మీరు కళ్లు విప్పారు. ఉన్నట్టుండి అవసరవాదాన్నీ, నక్సలైట్ విధానాన్ని అమాంతం కావిలించుకుంటున్నారు. దోపిడీ వ్యవస్థకి కారణమైన ఏ అవినీతి ప్రభుత్వాన్ని మీరు దుయ్యబడుతున్నారో, అదే అవినీతి ప్రభుత్వానికీ, దాని ఆశ్రిత సంస్థలకీ కడుగుతూ నగరాల్లో విలాస జీవితాలు గడుపుతున్న మీకు, ఎండల్లో, వానల్లో, కొండల్లో, అడవుల్లో తుపాకీ గుండ్లకు రొమ్ములొడ్డి తాము నమ్మిన దాని కోసం ఆవేశంతో పోరాడుతున్న నక్సలైట్లను సమర్థించే అధికారమూ అర్హతా లేవు. కృత్రిమమైన మోరల్ సపోర్ట్ ఎవరికీ అక్కరలేదు. మీ వందిమాగధ స్తోత్రాలూ, కైవారాలూ ఎవరికీ అక్కరలేదు. విప్లవాగ్ని జ్వాలలకు మీరేం కిరసనాయిల డబ్బాలు సరఫరా చెయ్యనక్కర్లేదు. దమ్ముంటే, నిజాయతీ ఉంటే దేశీయ సమస్యలకు నక్సలైట్ విధానం పరిష్కార మార్గమనే గట్టి నమ్మకం మీకుంటే పెళ్లాం బిడ్డల్ని వొదిలి ఉద్యోగాల్నీ విలాస జీవితాల్నీ వొదిలి కార్యరంగం మీదికి వెళ్లండి. వీరోచితంగా పోరాడండి. ఎండిన తాటాకులకు మంట పెట్టడం, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడటం, దూరంగా నిలబడి బావిలో నాలుగు రాళ్లు రువ్వి జలావర్తాలు సృష్టించడం, సమయం వస్తే తెరచాటుకు తప్పుకుని ప్రజలతో దోబూచులాడటం కాదు దిగంబర కవులు చేయవలసింది. సాయుధ పోరాటాన్ని నేను వొప్పుకున్న మాట నిజమే. సాయుధ పోరాటమంటే నక్సలైట్ విధానమని కాదు నా అర్థం. దేశ వ్యాప్తంగా ప్రజా సానుభూతితో రావలసిన ధర్మబద్ధమైన ప్రజా పోరాటం. నాలుగైదు కెరటాలు ఉవ్వెత్తున ఎగిరి పడ్డంత మాత్రాన సముద్రంలో తుపాను రాదు. రాజకీయాలకు, మతతత్వాలకు, సంకుచితత్వాలకు అతీతంగా గిరుల్ని గీతల్ని, అవధుల్ని దాటి సర్నోన్నత స్థాయిలో స్వచ్ఛందంగా పలకవలసిన కవిత, సంకుచిత వలయాల్లోకి, రాజకీయాల బురద గుంటల్లోకి ఎందుకు ప్రవేశించవలసి వచ్చింది? సముద్రాన్ని నదిలోకి మళ్లించాలనుకుం టున్న మీరు సముద్రాన్ని ఎప్పుడూ చూసిన పాపాన పోలేదు. రాజకీయాలు కవిత్వంలోకి ప్రవహిస్తాయి. కానీ కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు. దిగంబర కవితోద్యమ ప్రారంభ దశలో మీలో ఒక్కడైనా మార్క్స్, మావోల పేరెత్తలేదే. వారిని చదివాక ఇప్పుడే జ్ఞానోదయమైందా? మార్క్సిజం పుట్టిన ఒక శతాబ్దం తరువాత, ఆ సిద్ధాంతాల్ని అత్యధునాతనమైనవిగా ప్రచారం చేయడానికి కవులుగా మీకు సిగ్గెందుకు లేకుండా పోయింది? పోనీ మార్క్సిజాన్ని దృఢంగా విశ్వసించినప్పుడు, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే మీ ధ్యేయమైనప్పుడు, స్పష్టంగా ‘మేము మార్క్సిస్టు కవులమనో, మావోయిస్టు కవులమనో, సోషలిస్టు కవులమనో’ చెప్పుకోవడానికి సంకోచమెందుకు? దిగంబర కవులు అనే ముసుగెందుకు? శుద్ధ నాస్తికవాదులం అంటూనే పెళ్లాం సాకుతో తిరు పతి తీర్థయాత్రలు సేవించడం, శాస్త్ర సమ్మతంగా పెళ్లాడటం, ఆధునిక వివాహాలకు అత్యాధునిక పౌరోహిత్యాలు నెరపడం, పెళ్లిళ్లకు దిక్ పఠనాలు చెయ్యడం, రాజకీయోపన్యాసాలకు తయారు కావడం–ఇవన్నీ దిగంబర కవితా లక్షణాలని నేను ముందనుకోలేదు. నా దృష్టిలో దిగంబర కవిత్వ నిర్వచనమేదో కొత్తగా ఇవాళ చెప్పవలసిందేమీ లేదు. ఏ ఇజానికో తాకట్టు పడివుంటే నేను దిగంబర కవిని కానక్కర్లేదు. ఏ చెప్పులూ నా కాళ్లకి పట్టలేదు. ఏ దుస్తులూ నా ఒంటికి అతక లేదు. ఏ ఫ్రేములోనూ నా ఫొటో ఇమడలేదు. అందుకే నేను దిగంబర కవినయ్యాను. ఒక ఇజానికీ, ఒక విశ్వాసానికీ కట్టుబడిపోయి, దిగంబర కవులుగా మిమ్మల్ని మీరు నరుక్కున్నారు. మీరు నమ్మినదాన్నే ప్రపంచమంతా విశ్వసించాలని దౌర్జన్యంగా శాసిస్తూ మీ అల్పబుద్ధిని బయట పెట్టుకున్నారు. కట్టుబడిపోయిన మీకూ, దేనికీ కట్టుబడని నాకూ సంధి కుదరదు. పరిణామాల్ని ఊహించి మొహం చాటు చేసుకోవల్సిన గతి మీకు పడుతుంది. నాకు కాదు. తాటాకు చప్పుళ్లతో, కాగితప్పులి గర్జనలతో భయపెట్టలేరు. (1970లో దిగంబర కవులు ఇచ్చిన చార్జిషీట్‌కు మహాస్వప్న ఇచ్చిన సమాధానం సంక్షిప్త రూపం. మంగళవారం కన్నుమూసిన మహాస్వప్న స్మరణలో.) -
మార్క్సిజం ప్రాముఖ్యత మరింత పెరిగింది
ప్రపంచంలోని అనేక దేశాల్లో మార్క్సిజం, కమ్యూనిజం అదృశ్యమౌతున్న నేపథ్యంలో వివిధ దేశాల్లో ఈమధ్య కారల్‌మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చాలాచోట్ల ఆయన స్మృతికి నివా ళులర్పించడంతోపాటు మార్క్సిజాన్ని భిన్న కోణాల్లో చర్చించారు. గోష్టులు నిర్వహించారు. మార్క్స్ జన్మించిన జర్మనీలోని ట్రియర్ పట్ట ణంలో ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. చైనా బహుకరించిన ఈ విగ్ర హాన్ని ఆయన అప్పట్లో నివసించిన ఇంటికి సమీపంలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగానే చైనాలోని బీజింగ్, షెన్జెన్ నగరాల్లో గత నెల 27 నుంచి 30 వరకూ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 21వ శతాబ్దంలో కారల్‌మార్క్స్ ప్రాముఖ్యత గురించి, ప్రపంచంలో సామ్యవాదం భవితవ్యం గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సదస్సుల్లో 70 దేశాలకు చెందిన 75 కమ్యూనిస్టు పార్టీల నుంచి 112 మంది నేతలు పాల్గొన్నారు. మన దేశం నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కూడా సదస్సులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి చైనా నగరాల్లో జరిగిన సదస్సులు, వాటిలో జరిగిన చర్చల గురించి సాక్షి ప్రతినిధి జీకేఎం రావుకు ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చ డానికి భౌతిక శక్తులను శ్రామికవర్గం నేతృత్వంలో బలోపేతం చేయడం కోసం ప్రజా పోరాటాలను నిర్మించడమే మార్గమని ఏచూరి అంటున్నారు. ఇలాంటి పోరాటాలకు మార్క్సిజం ఒక్కటే సైద్ధాంతిక భూమికను అందిస్తుందని చెబుతున్నారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు: కారల్ మార్క్స్, కమ్యూనిజంపై వర్క్‌షాప్‌లు ఎలా జరిగాయి? చైనా సోషలిజానికి తిలోదకాలు ఇస్తూ, పెట్టుబడిదారీ పంథాలో పయనిస్తోందని ప్రపంచ దేశాలు భావిస్తున్న కారణంగా చైనాలో ఇలాంటి సమావేశాలు జరగడం మార్క్సిజానికి గొప్ప విజయం. తమపై ప్రపంచ ప్రజానీకంలో ఉన్న అపోహలనూ, అనుమానాలనూ నివృత్తి చేయడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమావేశాలు నిర్వహించింది. ప్రపంచంలో బలమైన ఆర్థికశక్తిగా చైనా అవతరించింది. సామ్యవాద పంథాలో పయ నిస్తూనే ఇది ఎలా సాధ్యమైంది? నేడు మార్క్సిజం అవసరం ఉందనడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన ప్రారంభ ఉపన్యాసం ప్రపంచ దేశాల కళ్లు తెరిపించింది. మార్క్సిజానికి చైనా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. సామ్యవాద పంథాలో పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదగటం సాధ్యమేనని చైనాను చూస్తే అర్ధమవుతుంది. చైనాలో అవినీతి, అసమానతలపై ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ రెండు అంశాలపై చైనా నిజంగా కలవరపడుతోంది. అవినీతి విస్తరించింది. ప్రభుత్వం అవినీతిని రూపుమాపడానికి కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అవినీతికి పాల్పడే వేలాది మంది అధికారులకు ప్రతి వారం ఉద్వాసన పలుకుతున్నారు. చైనాలో నగరాలు, పట్టణాలు పెరిగిపోవడంతో అసమానతలు అధికమౌతున్నాయి. ఈ సమస్య పరిష్కా రానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పట్టణాల్లోని ప్రజలు, ఫ్యాక్టరీలను గ్రామాలకు తరలిస్తున్నారు. గ్రామాల సముదాయాల్లో వైద్య సౌకర్యాలు సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నగరాలపై ఒత్తిడి తగ్గిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి. మార్క్సిజంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు? ప్రారంభ, ముగింపు సమావేశాలతోపాటు మూడు అంశాలపై ప్రత్యేక చర్చాగోష్టులు నిర్వహించారు. కారల్‌మార్క్స్ చారిత్రక ప్రాధాన్యం–నేటి పరిస్థితుల్లో మార్క్సిజం ప్రయోజనం, 21వ శతాబ్దంలో కొత్త పరిస్థితులకు అనుగుణంగా చైనా తరహా సోష లిజంపై షీ జిన్‌పింగ్ ఆలోచనా విధానం ప్రభావం, చైనాకు అనుసరణీయమైన సోష లిజం సిద్ధాంతాలు, ఆచరణ–ప్రపంచ సామ్యవాదం భవితవ్యంపై మూడు సదస్సులు జరిగాయి. ప్రపంచంలో సోషల్ డెమొక్రాట్లు, లిబరల్ డెమొక్రాట్లకు ఆదరణ పెరగడంతోపాటు, కొన్ని దేశాల్లో మార్పును వ్యతిరేకించే మితవాదులు బలపడుతున్న నేపథ్యంలో–మార్క్సిజం భవితవ్యం ఏమిటనే విషయం చర్చించారా? విశ్వవ్యాప్తంగా ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితంగా నేడు మార్క్సిజం విలువను, ప్రాధాన్యాన్ని అందరూ గుర్తిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీకి అంతముండదని, సంక్షోభం ముగియదని గుర్తించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందువల్లే పెట్టుబడిదారీ వ్యవస్థ పోవాల్సిందేనని అందరూ కోరుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడం మార్క్సిజాన్ని అనుసరించే పార్టీల వల్లనే సాధ్యమని తెలుసుకుంటున్నారు. ‘‘తత్వవేత్తలు ప్రపంచం తీరు గురించి అనేక పద్ధతుల్లో కేవలం భాష్యం చెప్పారు. కాని, ప్రపం చాన్ని మార్చాల్సిన అవసరం ఉంది’’ అని కారల్ మార్క్స్ చెప్పారు. ఎలా మార్చాలి? అనే విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దోపిడీని అంతం చేసి, మానవుల విముక్తి సాధించడానికి మార్క్సిజం ఒక్కటే మార్గాన్ని అందిస్తుంది. దోపిడీకి గురవుతున్న ప్రజలను ఆకట్టుకుంటున్న సిద్ధాంతం ఇదొక్కటే. మార్క్సిజం మార్పులేని సిద్ధాంతం కాదు. ఇదొక సృజనశీల శాస్త్రమని విప్లవ నేత లెనిన్ ఎన్నడో బోధించారు. చరిత్ర విశ్లేషణకు, మరీ ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానం పరిశీలనకు మార్క్సిజమే మంచి మార్గం. మార్క్సిస్టు సిద్ధాంతాలు, మార్క్స్ చూపించిన మార్గాల ప్రాతిపదికగా మేము మా సైద్ధాంతిక అవగాహనను బలోపేతం చేసుకుంటు న్నాము. ప్రస్తుత పరిస్థితులు, సంక్షోభాల నేగాక భవిష్యత్తులో కమ్యూనిస్టులకు గల అవ కాశాలను మార్క్సిజం వెలుగులో అర్థంచేసుకుంటున్నాం. ప్రపంచ నేతగా అవతరించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రసంగంలో మీకు నచ్చిన అంశమేంటి? మార్క్సిజం కాలం చెల్లిన సిద్ధాంతం కాదని, ఇది ఎప్పటికీ విలువైనదేననే వాదనకు అభివృద్ధి పథంలో అగ్రగామిగా సాగుతున్న చైనా తిరుగులేని సాక్ష్యమని జిన్‌పింగ్ చెప్పారు. ‘ఇరవయ్యో శతాబ్దం మధ్య వరకూ తూర్పు ప్రపంచంలో జబ్బు మనిషిగా ముద్రపడిన దేశం నేడు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా నిరూపించుకుంది’ అని ఆయన స్పష్టం చేశారు. కొత్త శకానికి కావాల్సింది చైనా తరహా లక్షణాలున్న సామ్య వాదమే అని జిన్‌పింగ్ నమ్ముతున్నారు. ఈ సదస్సులో మీరేం మాట్లాడారు? సమస్య ఎంత తీవ్రమైనదైనా పెట్టుబడిదారీ వ్యవస్థ దానంతటదే కూలిపోదు. కేపిట లిజాన్ని సవాలు చేసే రాజకీయ ప్రత్యామ్నాయం రూపుదిద్దుకునే వరకూ ఇది మానవుల దోపిడీని కొనసాగిస్తూ తన ఉనికిని కొనసాగిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదో యడానికి మేం సమాజంలోని భౌతిక శక్తులను శ్రామిక వర్గం నేతృత్వంలో బలోపేతం చేయాల్సి ఉంటుంది. ప్రజా పోరాటాల ద్వారానే ఇది సాధ్యమౌతుంది. ఇలాంటి పోరా టానికి మార్క్సిజం ఒక్కటే సైద్ధాంతిక భూమికను అందిస్తుంది. -
నవ తెలంగాణే..
⇒ నేటినుంచి సూర్యాపేటలో జిల్లా మహాసభలు ⇒ కొత్త కమిటీ ఎన్నికతోపాటు భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన ⇒ ‘సామాజిక’ కోణంలో ముందుకెళ్లే యోచనలో పార్టీ నాయకత్వం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా మహాసభలకు తొలిసారిగా సూర్యాపేట వేదిక కాబోతోంది. ఈనెల 27,28,29 తేదీల్లో మూడురోజులపాటు జరగనున్న ఈ మహాసభల్లో ఎప్పటిలాగే పార్టీ నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోనున్నారు. అయితే, సీపీఎం పార్టీకి మొదటి నుంచీ బలమైన కేంద్రంగా ఉన్న నల్లగొండ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన నష్టాలను పూడ్చుకుని, పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నం చేసే దిశలో జరగనున్న ఈ మహాసభలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. తెలంగాణ వద్దన్న పార్టీగా, మళ్లీ రాష్ట్రంలో ఎలా బలపడాలన్న యోచనలో పార్టీ జిల్లా కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా సామాజిక అంశాలే ప్రాతిపదికగా, అట్టడుగు వర్గాల ప్రయోజనం కోసం పనిచేయడం ద్వారా పార్టీని మళ్లీ బలోపేతం చేయాలన్న యోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సైద్ధాంతిక నిర్మాణంపై కూడా ఈ మహాసభల్లో ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. నై తెలంగాణ టు నవ తెలంగాణ వాస్తవానికి సీపీఎం జాతీయ దక్పథం మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ప్రకటించింది. అంతకుముందు పార్టీలోని అంతర్గత పరిణామాలతో పాటు ప్రత్యేక రాష్ట్రఆకాంక్షకు వ్యతిరేకంగా పార్టీ వెళ్లిందనే కారణంతో జిల్లాలో చాలామంది ఆపార్టీకి దూరమయ్యారు. ముఖ్యంగా తెలంగాణవాదులు, మేధావులపరంగా కూడా నష్టపోయింది. గత సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా దెబ్బతింది. అప్పటివరకు ఉన్న ఒక్క ఎమ్మెల్యేస్థానం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సెంటిమెంట్‌తో నిమిత్తం లేకుండా పార్టీని బలోపేతం చేసుకోవాలని, నవతెలంగాణ నినాదంతో ముందుకెళ్లాలనే యోచనలో జిల్లాపార్టీ నాయకత్వం ఉంది. ఇందుకోసం ‘సామాజిక’ అంశాలను ఎజెండాగా చేసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలతో పాటు కులవృత్తులు, ట్రేడ్‌యూనియన్ సమస్యలు (అసంఘటిత రంగాలకు చెందిన వారిని కలుపుకుని) తీసుకుని పోరాటాలు చేయాలని ఆలోచిస్తోంది. ఆ దిశలో జిల్లా మహాసభల్లో చర్చలు జరుపుతామని, పూర్తిస్థాయి పోరాట కార్యక్రమాలను తీసుకోవడం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళతామని ఆ పార్టీ నేతలంటున్నారు. మరోవైపు పార్టీపరంగా సైద్ధాంతిక పునాదులను మరింత బలపర్చుకునే దిశలో వారంలో ఒకరోజు డివి జన్స్థాయిలో పార్టీ నాయకత్వానికి స్టడీసర్కిళ్లు కూడా ఏర్పాటు చేయాలని మార్క్సిస్టులు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ మహాసభల్లో ప్రతినిధులు చర్చించి భవిష్యత్ ప్రణాళికను రూపొందించనున్నారు. అదేవిధంగా సంస్థాగత నిర్మాణం కోసం పార్టీ క్షేత్రస్థాయి మహాసభలను కూడా ఆ పార్టీ అందిపుచ్చుకుంది. జిల్లావ్యాప్తంగా అన్ని డివిజన్లు, మండలాలు, పట్టణాల మహాసభలను పూర్తి చేసుకుని ఇప్పుడు జిల్లా మహాసభలకు సిద్ధమవుతోంది. జిల్లా మహాసభల్లో భాగంగా మునుగోడు, మిర్యాల గూడ, తుంగతుర్తి డివిజన్ కార్యదర్శులను మార్చి కొత్తనాయకత్వానికి అవకాశం ఇచ్చింది.