maryada ramanna
-
అందంతో కుర్రకారును ఆగం చేస్తున్న సలోని (ఫొటోలు)
-
మర్యాద సీతమ్మ.. టీవీలో నిర్మాతగా తొలి మహిళ
ప్రధానమంత్రి పదవికి అనుభవం ఏమిటని అడుగుతారా? నాకు చిన్న అవకాశం ఇవ్వడానికి ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘అవకాశం ఇచ్చి చూడండి... సర్వీస్ నచ్చకపోతే రద్దు చేయండి’ సహనం హద్దు శిఖర స్థాయిని చేరిన క్షణంలో వచ్చిన మాటలవి. ఈ రోజు బ్యూటీ ఇండస్ట్రీకి ఆమె ఒక మార్గదర్శనం. ‘టీవీలో నిర్మాతగా తొలి మహిళ’’ అనే మకుటం ఆమె తొలి విజయం. ఈ రెండు విజయాల మధ్య ఓ విషమ పరీక్ష... అదే ఆమెను ధీరగా నిలిపింది. దూరదర్శన్ తొలి మహిళా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ సీతాదేవి పరిచయం. ‘మర్యాద రామన్న’ ఈ తీర్పరి పేరు తెలుగు బాల్యానికి చిరపరిచితం. ఈ న్యాయనిర్ణేత గురించి వింటూ పెరిగిన బాల్యానికి ఒక కనువిందు దూరదర్శన్‌లో ప్రసారమైన మర్యాదరామన్న సీరియల్. ఈ జానపద కథాస్రవంతికి దృశ్యరూపం ఇచ్చిన నిర్మాత సీతాదేవి. టెలివిజన్ రంగం తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో ఆ రంగాన్ని చేయి పట్టుకుని నడిపించిన అనేకమంది ఉద్దండుల మధ్య ఒక లలితసుమం ఆమె. సీరియల్ నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకుల టైటిల్ కార్డుల్లో ‘నిర్మాత: సీత’ రెండక్షరాల పేరు ఆమె. ఆ తర్వాత ఆమె పేరు ముందు మర్యాద రామన్న అనే గౌరవం చేరింది. టెలివిజన్ రంగంలో ఆమె గుర్తింపు ‘మర్యాద రామన్న సీతాదేవి’గా స్థిరపడిపోయింది. తెర నిండుగా వినోదం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట ఆమె సొంతూరు. నాన్న కోదండ రామయ్య డాక్టర్. తల్లి విజయరాజేశ్వరి గృహిణి. ‘‘మా అమ్మ స్ట్రాంగ్ ఉమన్. నాకు రోల్ మోడల్’’ అన్నారు సీతాదేవి. హైదరాబాద్, వనిత కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కెరీర్ గురించి సృజనాత్మకమైన ఆలోచనలు చిగురించాయామెలో. అప్పటి వరకు ముందు గదిలో శ్రవణానందం చేసిన రేడియోలు... ముందు గదిని టీవీలకు ఇచ్చి, తాము వెనుక గదులతో రాజీ పడుతున్న రోజులవి. దూరదర్శన్ అంటే పందుల పెంపకం అనే చమత్కారం చిరుదరహాసంగా స్థిరపడుతున్న రోజుల్లో ఓ ప్రయోగం మర్యాదరామన్న సీరియల్. ఆనందోబ్రహ్మ హాయిగా నవ్వించి హాస్యాన్ని కురిపిస్తుంటే, మర్యాద రామన్న ఆలోచింప చేస్తూ అలరించింది. సీతాదేవి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘ఆ సీరియల్‌కి స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడం ఒక ఘట్టం అయితే, చిత్రీకరించడం మరో ఘట్టం. జానపద కథకు కాస్ట్యూమ్స్ తయారీ పెద్ద సవాల్. సొంతంగా కుట్టించడానికి మా బడ్జెట్ సరిపోదు. సురభి వాళ్ల దగ్గర ప్రయత్నించాను. కెమెరా కంటికి సంతృప్తినివ్వవు అనిపించింది. సింహాసనం సినిమా గుర్తు వచ్చింది. ఆ రాజదర్బారు సెట్టింగ్‌లు, దుస్తులు ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకున్నాను. దాంతో మర్యాద రామన్నలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా వచ్చింది. పట్టును తలపించే జరీ అంచు దుస్తులు, నవరత్న ఖచిత మణిమయ మకుటాలను తలపించే ఆభరణాలు, లైటింగ్‌తో మెరుపులీనుతూ వీక్షకులను టీవీకి కట్టిపడేశాయి. ఇక కథలోని నీతి, మేధోపరమైన తార్కికత పిల్లలను ఆకట్టుకుంది. రెండు వందలకు పైగా ఆర్టిస్టులతో ఐదారు నెలల్లో సీరియల్ చిత్రీకరణ పూర్తి చేశాం. ఇది 1989–90ల నాటి మాట. ఆ తర్వాత ‘ఆణి ముత్యాలు’ శీర్షికన గురజాడ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి మంచి కథకుల కథలకు దృశ్యరూపం ఇచ్చాం. సజావుగా సాగిపోతున్న తరుణంలో ఒక అవాంతరం రాజాజీ గారి మనుమడి నుంచి వచ్చింది. కాపీ రైట్ పోరు ప్రముఖ జాతీయ నాయకులు సి.రాజాజీ గారి కథల ఆధారంగా హిందీలో ‘కన్యాకుమారీ కీ కహానియా’ తీశాం. ఆ కథలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆర్ధోడాక్స్ కుటుంబాల జీవితాలకు దర్పణం అన్నమాట. రాజాజీ తన కథల కాపీరైట్ భారతీయ విద్యాభవన్కి వచ్చారు. మేము ముంబయికి వెళ్లి ఆ సంస్థ నుంచి అధికారికంగా రైట్స్ తీసుకున్నాం. దూరదర్శన్ ప్రయోగాత్మకంగా మొదట ఆరు కథలకే అనుమతి ఇచ్చింది, ఆ ఆరు కథలను చిత్రీకరించాం. అవి టెలికాస్ట్ కావడానికి అంతా సిద్ధమైన తర్వాత డెక్కన్ క్రానికల్‌లో ఒక వార్త. నిర్మాత, దూరదర్శన్ కుమ్మక్కై కాపీ రైట్స్ ఉల్లంఘించి కథలను వాడుకున్నారనేది ఆరోపణ. మా తప్పు లేదని రెండేళ్ల పాటు కోర్టులో పోరాడి పోరాడి, చివరికి కోఠీలో కాపీ రైట్ పుస్తకాలు తెచ్చుకుని చదివి, కాపీ రైట్ బోర్డును సమాధాన పరిచి ఆ ఆరు కథలను ప్రసారం చేయగలిగాం. నేను ఏ సవాల్‌నైనా స్వీకరించగలననేంతటి ఆత్మవిశ్వాసం నాలో ఉండేది. ఆ టైమ్‌లో ఆరోగ్యం కొత్త సవాల్ విసిరింది. అనారోగ్యంతో పోరాటం మామూలు జ్వరం రూపంలో మొదలైన అనారోగ్యానికి మూలం తలలో ఉందని తెలియడానికి ఆరు నెలలు పట్టింది. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట... మల్టిపుల్ స్లె్కరోసిస్ పట్ల పెద్దగా అవగాహన కూడా లేదు. అది నరాల సమస్య. ఆకలి లేదు, తిన్నది కడుపులో ఇమడదు. కంటిచూపు దాదాపుగా పోయింది, నడక పట్టు తప్పింది. అంత తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాను. ఆ సవాల్‌ని కూడా మనోధైర్యంతో ఎదుర్కొన్నాను. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నన్ను నేను ఏదో ఒక వ్యాపకం లో బిజీగా ఉంచుకోకపోతే మానసికంగా ఆరోగ్యవంతం కాలేననిపించింది. పని మీద బయటకు వెళ్తేనే మంచిగా తయారవుతాం. బయటకు వెళ్లాల్సిన పని లేకపోతే బద్దకంగా గడిపేస్తాం. ఇలా ఉండకూడదని మళ్లీ పనిలో పడ్డాను. సీరియల్ చిత్రీకరణ వంటి ప్రెషర్ పెట్టుకోవద్దని చెప్పారు డాక్టర్లు. బ్యూటీ ఇండస్ట్రీ అయితే అలవోకగా నడిపేయవచ్చనే ఉద్దేశంతో పింక్స్ అండ్ బ్లూస్ పేరుతో ఈ రంగంలో అడుగుపెట్టాను. అవకాశం కోసం జూబ్లీహిల్స్ క్లబ్లో బ్యూటీ సెలూన్ కోసం అడిగినప్పుడు చాలా రోజులు ఇవ్వలేదు. ‘మీకున్న అనుభవం ఏంటన్నారు, కోర్సు చేశారా’ అన్నారు. ‘కోర్సు చేసిన నిపుణులను ఉద్యోగులుగా నియమించుకుంటాను’ అని చెప్పాను. అయినా ఇవ్వలేదు. ఇక విసిగిపోయి ‘ప్రధానమంత్రి పదవికి అనుభవం అడుగుతున్నారా’ అని అడగడంతో నాకు అవకాశం ఇచ్చారు. అలా 2005 క్రిస్టమస్ రోజు మొదలైన పార్లర్ ఇప్పుడు నలభై బ్రాంచ్‌లకు విస్తరించింది. ఫ్రాంచైజీలు ఇచ్చే స్థాయికి చేరింది. ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరణ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను’’ అని చిరునవ్వు నవ్వారు సీతాదేవి. బహుశా ఆ నవ్వులో నిండిన మెండైన ఆత్మవిశ్వాసమే ఆమెను విజేతగా నిలిపినట్లుంది. నేను విజేతనే ‘కన్యాకుమారీ కీ కహానియా’ కథాస్రవంతిలో మిగిలిన కథల చిత్రీకరణకు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ దూరదర్శన్ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఫ్లాప్‌తో ఆగిపోవడం నాకు నచ్చదు. అందుకే ‘ఆంధ్రరత్నాలు’ పేరుతో తెలుగు ప్రముఖుల జీవితాలను చిత్రీకరించాను. ఇరవై ఏళ్ల ప్రయాణంలో డబ్బు పెద్దగా సంపాదించలేదు, కానీ మంచి ప్రయత్నం చేశాననే సంతృప్తి కలిగింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కథకు పార్లమెంట్లో ప్రశంసలు వచ్చాయి. రాజాజీ కథలను అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ మెచ్చుకుని, ఆ వీడియోలు తెప్పించుకున్నారు. ఆ సందర్భంగా మా టీమ్‌ని రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించారు. – పి. సీతాదేవి, ఫౌండర్, ఐశ్వర్య ఫిలింస్, పీఎన్బీ సెలూన్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
‘మర్యాద రామన్న’తో గుర్తింపు
సాక్షి, మహానంది: మర్యాద రామన్న చిత్రం తనకెంతో గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సినీ నటుడు నాగినీడు తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం గురువారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటగా ప్రసాద్ ల్యాబ్స్‌లో వర్కర్‌గా పనిచేసేవాడినన్నారు. అక్కడ పనిచేస్తుండగా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనను గుర్తించి ఫిజిక్ బాగుందని మొదటగా చెన్నకేశవరెడ్డి చిత్రంలో అవకాశం ఇచ్చారన్నారు. అనంతరం వచ్చిన మర్యాద రామన్న చిత్రం తనకెంతో గుర్తింపు తెచ్చిందని చెప్పారు. చిత్రంలో రామినీడు పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం లభించిందన్నారు. ప్రస్తుతం వాల్మీకి, బందోబస్త్ చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న మనిషి ఆకలి తీర్చడం ద్వారా లభించే ఫలితం అనంతమైనదని చెప్పారు. తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో మనోవికాస్ కేంద్రం పేరుతో విద్యార్థులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. తన కుమారుడి వైద్యసేవల నిమిత్తం నంద్యాల పట్టణానికి వచ్చినట్లు వివరించారు. -
మర్యాద విలనన్న!
నెరిసిపోయిన రామినీడు బుర్ర మీసాలను చూశారా? మరోసారి చూస్తే... మీసంలా కాదు... పగ ప్రతీకారంతో బుసలు కొడుతున్న సర్పాల్లా ఉంటాయి. ఆ కళ్లు... పొద చాటు పొంచి ఉన్న పులి కళ్లలా ఉంటాయి. రామినీడు అంటే మాటలా?! దేనికదే సెపరేట్... మర్యాదకు మర్యాద... పగకు పగ! ఎక్కడా లోటు ఉండదు!! ‘కబుర్లు తరువాతమ్మా... ముందు భోజనాల ఏర్పాట్లు చూడండి’ అంటూ ఇంటికొచ్చిన అతిథికి మర్యాదలు చేయగలడు. ఒకవేళ ఆ అతిథి పగోడైనా సరే... ‘అలా చూస్తావేంది నాయనా... నా కొడుకును నరికెయ్యి’ అని కన్నకొడుకు రెచ్చగొట్టినా సరే... పొరపాటున కూడా కత్తి తీయడు ఈ రామినీడు. అంతమాత్రాన అతను చేతులు ముడ్చుకునేం కూర్చోడు. మాటలతోనే పంజా విసురుతాడు ఇలా... ‘వాడ్ని ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఇంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా యింట చంపను. వాడు బయట గడప దాటి అడుగుపెట్టిన క్షణమే తల, మొండెం వేరవ్వాల’ రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాతో నాగినీడు రూపంలో తెలుగు వెండితెరకు సరికొత్త విలనీయుడు పరిచయం అయ్యాడు. ‘రామినీడు’గా ప్రతినాయకుని పాత్రలో వందకు వంద శాతం మార్కులు తెచ్చుకొని ‘ఉత్తమ విలన్’గా ప్రశంసలు అందుకున్నారు నాగినీడు. చిన్నప్పుడు... సినిమాకు వెళ్లొచ్చిన బాలనాగినీడు... ఇంటికొచ్చి సరికొత్త సినిమా చూపించేవాడు. విషయం ఏమిటంటే... సినిమాలో రకరకాల క్యారెక్టర్లను అనుకరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన అమ్మగారు అంటుండేవారట... ‘సినిమాల్లోకి పోక మమ్మల్ని ఎందుకురా చంపుతున్నావు’ అని. తథాస్తు దేవతలు ఏమన్నారో మనకు తెలియదుగానీ... ఆయన సినిమాల్లోకి పోలేదు.... ఆ తరువాత కాలంలో కెమికల్ టెక్నాలజీ చదవడం కోసం మద్రాస్ వెళ్లారు. ఆ తరువాత ప్రసాద్‌ల్యాబ్‌లో జనరల్ మేనేజర్ అయ్యారు. వృత్తి అతడిని రకరకాల నగరాలు తిప్పుతుందిగానీ... ‘నటన’ మాత్రం ఎక్కడో ఉండిపోయింది. మరి దాన్ని నిద్రలేపింది ఎవరు? ఒకసారి నిర్మాత బెల్లంకొండ సురేష్ నాగినీడుతో ఏదో విషయం మాట్లాడుతూ... ‘‘అవునూ... మీరు సినిమాల్లో నటించవచ్చు కదా!’’ అన్నారు. ‘‘మీరు చేయించుకుంటే చేస్తాను’’ అన్నారు నాగినీడు. అలా నిద్రించిన కోరిక నిద్ర లేచింది. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో మినిస్టర్ పాత్ర పోషించారు నాగినీడు. పెదాలు, కళ్లతో మాత్రమే నటనను పండించాలి. ఆ పని విజయవంతంగా చేసి శభాష్ అనిపించుకున్నారు నాగినీడు. ‘పల్లికుడమ్’ అనే తమిళ సినిమాలో నాగినీడు నటించిన క్లిప్స్‌ను చూశారు రాజమౌళి. ఆయనకు నాగినీడు నటన నచ్చింది. అలా డైరెక్టర్ రాజమౌళి నుంచి నాగినీడుకు పిలుపొచ్చింది. ‘మర్యాద రామన్న’ సినిమాలో నటించే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అది అల్లాటప్పా అవకాశం కాదు... ఆ సినిమాలో ప్రధాన విలన్ పాత్ర! ‘రాజమౌళి రిస్క్ చేస్తున్నాడేమో’ అనుకున్నారు చాలామంది. సినిమాలో ఒక బలమైన పాత్రను... అప్పటికి పెద్దగా పేరు లేని నాగినీడును వరించడం... రకరకాల లెక్కల రీత్యా అది సాహసమేమో కూడా! అయితే రాజమౌళి నాగినీడును నమ్మారు. నాగినీడు... తనలోని నటనను నమ్మారు. అందుకే... ‘మర్యాద రామన్న’లో రామినీడు పాత్ర అంత పెద్ద హిట్ అయింది. ‘ఉత్తమ విలన్’గా నంది అవార్డ్ గెలుచుకునేలా చేసింది. ‘నటన అనేది కళ్ల ద్వారా రావాలి’ అంటూ సావిత్రిని గుర్తు చేస్తారు నాగినీడు. ‘ఒక పేజీ డైలాగు ఇచ్చే భావాన్ని కంటి చూపుతో సావిత్రి ఇచ్చేవారు’ అంటారు ఆయన. కళ్లలో నుంచే భావాన్ని క్యారీ చేసే ప్రతిభ నాగినీడుకు పట్టుబడింది. అందుకే అతని నటనలో సహజత్వం కనిపిస్తుంది. -
‘మర్యాద రామన్న’కు ...అది ప్రేరణ
‘‘కాపీ కొట్టడానికీ, ప్రేరణగా తీసుకోవడానికీ మధ్య చాలా స్వల్పమైన తేడా ఉంటుంది. ఒకవేళ ఏదైనా పాత చిత్రంలో మనసుకి నచ్చిన అంశం ఉందనుకోండి... దాన్ని ప్రేరణగా తీసుకుని వేరే సినిమాలో పొందుపరచడం తప్పు కాదు. అయితే, ఆ మాతృక సినిమా తాలూకు సృష్టికర్తకు నష్టం మాత్రం కలిగించకూడదు’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఒక సినిమాలో ఉన్న సన్నివేశం వేరే సినిమాలో ఉంటే.. ‘భలే కాపీ కొట్టాడు’ అని ప్రేక్షకులు విమర్శించడం సహజం. ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న దర్శకుల్లో రాజమౌళి కూడా ఉన్నారు. ఓ ఉత్తరాది విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దీని గురించి మాట్లాడుతూ-‘‘1923లో విడుదలైన ఆంగ్ల మూకీ చిత్రం ‘అవర్ హాస్పిటాల్టీ’ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ చిత్రకథను నాదైన శైలిలో చెప్పాలనుకున్నాను. అలా రూపొందించినదే ‘మర్యాద రామన్న’. ఒక కథను ప్రేరణగా తీసుకొని మనం సినిమా తీసినప్పుడు, ఆ ప్రేరణనిచ్చినకథకు సంబంధించిన రచయితలను మనం సంప్రదించి, వారి అనుమతి తీసుకోవడం న్యాయం. కానీ... నాకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే... ‘అవర్ హాస్పిటాల్టీ’ చిత్రకథా రచయితలు చనిపోయారు. నేను కాపీ కొట్టానని ఎవరైనా అంటే.. పట్టించుకోను. సాంకేతికంగా చూస్తే.. ఓ ప్రొడక్ట్ సృష్టించి 75 ఏళ్లు పూర్తయితే.. కాపీరైట్ లేకుండా వాడుకోవచ్చు. అయితే, ఈ మధ్యే తీసిన చిత్రాల్లోని సన్నివేశాలను ఏదైనా మరో సినిమాలో వాడాలనుకుంటే అనుమతి తీసుకోవాల్సిందే’’ అన్నారు. -
గ్రేట్ క్రియేటర్స్
కల్మషం లేని ఆ పిల్లల నవ్వులు మర్యాదరామన్నను కట్టిపడేశాయి. మనసున మెదిలిన రూపాలను అందంగా తీర్చిదిద్దిన ఆ విద్యార్థులు భీమవరం బుల్లోడి మనసు దోచుకున్నారు. మానసిక వైకల్యాన్ని ఎదిరిస్తూ.. కళలో రాణిస్తున్న బేగంపేటలోని శ్రద్ధ సబూరి స్కూల్ విద్యార్థులతో హీరో సునీల్ సోమవారం సందడిగా గడిపారు. పాఠశాల మాతృ సంస్థ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమర్థ్ వొకేషనల్ స్కూల్లో శిక్షణ పొందిన 200 మంది విద్యార్థులు రూపొందించిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు సునీల్ హాజరయ్యారు. పేపర్ ప్రొడక్ట్స్, జూట్ బ్యాగ్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, జెల్లీ క్యాండిల్స్ వంటి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. నచ్చే కొంటున్నా... విద్యార్థులు రూపొందించిన ప్రొడక్ట్స్ చూసి సునీల్ ముచ్చటపడ్డారు. అక్కడి ఐటెమ్స్ కొనుగోలు చేశారు. మానసిక వైకల్యాన్ని అధిగమిస్తూ ప్రతిభ చూపిన ఈ విద్యార్థులను చూసిన సునీల్ ఎమోషనల్ అయ్యారు. వాటిని ఎలా తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. ‘వీళ్ల సృజనాత్మకత గొప్పది. నవ్వులో ఎంత ప్యూరిటీ ఉందో.. పనిలోనూ అంతే క్వాలిటీ ఉంది. వారి మీద జాలితో ఈ వస్తువులు కొనలేదు.. ఆ ప్రొడక్ట్స్ నచ్చడంతోనే కొన్నాన’ని చెప్పాడు సునీల్. విద్యార్థులు రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ గణేష్ ప్రతిమలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఎక్స్పో ద్వారా వచ్చిన ఆదాయాన్ని విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. - సిరి -
జపాన్‌లో మర్యాదరామన్న
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాదరామన్న చిత్రం త్వరలో జపాన్ దేశవ్యాప్తంగా విడుదల కానుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇప్పటికే హిందీ, తమిళ్, బెంగాలీ భాషల్లోకి అనువాదమైన ఆ చిత్రం అక్కడి బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో మర్యాద రామన్న చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేయాలని ఆ చిత్ర హక్కుదారుడు సంకల్పించినట్లు సమాచారం. కాగా అందుకు సంబంధించిన వర్క్ దాదాపుగా పూరైనట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో మర్యాద రామన్న చిత్రం జపాల్ దేశవ్యాప్తంగా హల్చల్ చేయనుంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోనీ హీరోహీరోయిన్లుగా నటించిన మర్యాదరామన్న చిత్రం తెలుగులో బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వరుసగా వచ్చిన మగధీర, మర్యాదరామన్న, ఈగ చిత్రాలు విజయఢంకా మోగించిన విషయం విదితమే. జపాన్‌లో రజనీకాంత్‌కు మంచి పాలోయింగ్ వుంది. ఆయన నటించిన ముత్తు, బాషా తదితర చిత్రాలలోపాటు ఇటీవలే విడుదలైన కొచ్చాడియాన్ వరకు అన్ని జపాన్ భాషలోకి అనువాదమై విడుదలైయ్యాయి. ఆ చిత్రాలకు జపనీయులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సునీల్ చిత్రం మర్యాదరామన్న కూడా జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాడు. సునీల్ జపనీయులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.