‘మర్యాద రామన్న’కు ...అది ప్రేరణ
‘‘కాపీ కొట్టడానికీ, ప్రేరణగా తీసుకోవడానికీ మధ్య చాలా స్వల్పమైన తేడా ఉంటుంది. ఒకవేళ ఏదైనా పాత చిత్రంలో మనసుకి నచ్చిన అంశం ఉందనుకోండి... దాన్ని ప్రేరణగా తీసుకుని వేరే సినిమాలో పొందుపరచడం తప్పు కాదు. అయితే, ఆ మాతృక సినిమా తాలూకు సృష్టికర్తకు నష్టం మాత్రం కలిగించకూడదు’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఒక సినిమాలో ఉన్న సన్నివేశం వేరే సినిమాలో ఉంటే.. ‘భలే కాపీ కొట్టాడు’ అని ప్రేక్షకులు విమర్శించడం సహజం. ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న దర్శకుల్లో రాజమౌళి కూడా ఉన్నారు.
ఓ ఉత్తరాది విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దీని గురించి మాట్లాడుతూ-‘‘1923లో విడుదలైన ఆంగ్ల మూకీ చిత్రం ‘అవర్ హాస్పిటాల్టీ’ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ చిత్రకథను నాదైన శైలిలో చెప్పాలనుకున్నాను. అలా రూపొందించినదే ‘మర్యాద రామన్న’. ఒక కథను ప్రేరణగా తీసుకొని మనం సినిమా తీసినప్పుడు, ఆ ప్రేరణనిచ్చినకథకు సంబంధించిన రచయితలను మనం సంప్రదించి, వారి అనుమతి తీసుకోవడం న్యాయం. కానీ... నాకు ఆ అవకాశం లేదు.
ఎందుకంటే... ‘అవర్ హాస్పిటాల్టీ’ చిత్రకథా రచయితలు చనిపోయారు. నేను కాపీ కొట్టానని ఎవరైనా అంటే.. పట్టించుకోను. సాంకేతికంగా చూస్తే.. ఓ ప్రొడక్ట్ సృష్టించి 75 ఏళ్లు పూర్తయితే.. కాపీరైట్ లేకుండా వాడుకోవచ్చు. అయితే, ఈ మధ్యే తీసిన చిత్రాల్లోని సన్నివేశాలను ఏదైనా మరో సినిమాలో వాడాలనుకుంటే అనుమతి తీసుకోవాల్సిందే’’ అన్నారు.