Masaipeta accident
-
మమ అనిపించారు
- కాకతీయ హైస్కూల్‌పై విచారణ - ఇలా వచ్చి అలా వెళ్లిన డీఈఓ, ఏజేసీ - నోటీసు గడువు ముగిసినా చర్యలకు వెనుకంజ తూప్రాన్: మాసాయిపేట దుర్ఘటనలో 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, యావత్ దేశం అయ్యోపాపమంటూ కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనలో కాకతీయ హైస్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తినా, అధికారులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైలు ప్రమాద పూర్వాపరాలు, పాఠశాల యాజమాన్యం పాత్ర తదితర అంశాలపై విచారణ చేపట్టేందుకు శనివారం కాకతీయ హైస్కూల్‌లుకు వచ్చిన ఏజేసీ మూర్తి, డీఈఓ రాజేశ్వర్‌రావు, ఆర్వీఎం అధికారిని యాసీన్‌బాషాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ప్రమాద ఘటనపై పాఠశాల పాత్ర ఏమిటన్నదానిపై మూడు రోజుల కిందటే పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని, శనివారంతో ఆ గడువు కూడా ముగిసిందన్న డీఈఓ..స్కూల్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి వారిచ్చే సూచన మేరకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. మరోవైపు ఏజేసీ మూర్తి కూడా కేవలం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడటంతోనే సరిపెట్టారు. ఇక ఆర్వీఎం అధికారిని యాసీన్‌బాషా మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు. పాఠశాల తెరవాలంటూ తల్లిదండ్రుల పట్టు! విచారణ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న సుమారు 600 పైగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలను వెంటనే తెరువాలని పట్టుబట్టారు. ఇప్పటికే యూనిఫాం, పుస్తకాలు తీసుకోవడంతో పాటు మొదటి విడత ఫీజులు చెల్లించామని ఏజేసీ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల అనుమతులు రద్దు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఆగమ్యగోచరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో పాఠశాలకు చెందిన 18 మంది చిన్నారులు దుర్మరణం చెందడం, మరో 18 మంది ఆస్పత్రిలో చికిత్సలు పొందడం చాలా బాధకరమని, ఇందుకు తాము సైతం చింతిస్తున్నట్లు అదనపు జేసీ ముందు వాపోయారు. ఈ సందర్భంగా అదనపు జేసీ స్పందిస్తూ ఈ పాఠశాలకు చెందిన చిన్నారులను స్థానిక ప్రభుత్వ పాఠశాల, ఇతర ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తామన్నారు. ఇందుకు ఒప్పుకోని తల్లిదండ్రులు కాకతీయ పాఠశాలను తెరిపించాలని పట్టుబట్టారు. దీంతో తమ అభిప్రాయాలను రాసి డీఈఓ రాజేశ్వర్‌రావుకు అందిస్తే ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఏజేసీ మూర్తి వారితో తెలిపారు. విద్యార్థుల సంఖ్య కూడా తప్పే కాకతీయ హైస్కూల్లో సుమారు 600 మంది విద్యార్థులు చదువుతుండగా, కేవలం 378 మంది విద్యార్థులే ఉన్నట్లు కాకతీయ హైస్కూల్ యాజమాన్యం వెల్లడించిందని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. అందువల్లే జిల్లాలోని అన్ని పాఠశాలకు చెందిన విద్యార్థుల సంఖ్యను తరగతుల వారీగా సమాచారం అందించాలని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓలను ఆదేశించినట్లు డీఈఓ తెలిపారు. ఇందుకోసం ఈ నెల 5న సంగారెడ్డిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 స్కూల్ బస్సులు సీజ్ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా 19 ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నట్లు గుర్తించి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామన్నారు. -
నత్తనడకన రైల్వే గేటు పనులు
కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్న పోలీసులు వెల్దుర్తి : మాసాయిపేట దుర్ఘటనలో 18 మంది చిన్నారులు మృత్యువాత పడినా, రైల్వే అధికారులు మాత్రం తమ మొద్దు నిద్ర వీడడం లేదు. 24వ తేదీ దుర్ఘటన జరిగిన వెంటనే దేశ వ్యాప్తంగా రైల్వే పనితీరుపై విమర్శలు వెల్లువెత్తగా, 25వ తేదీనే రైల్వే అధికారులు హుటాహుటీన గేటు ఏర్పాటు కోసం పనులు ప్రారంభించారు. అయితే పనులు ప్రారంభమై వారం రోజులు గడిచినా పూర్తి కావడం లేదు. మరోవైపు ప్రమాదస్థలి నిజామాబాద్ - హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఈ దారి వెంట వెళుతున్న వారంతా వాహనాలు పక్కకు ఆపి ప్రమాద స్థలికి వెళ్లి మృతులకు నివాళులర్పిస్తున్నారు. ఇక చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు, వివిధ పాఠశాలల చిన్నారులు పెద్దఎత్తున ప్రమాద స్థలికి తరలివస్తుండడంతో సంఘటన జరిగిన రైల్వే ట్రాక్ సమీపంలో రద్దీ బాగా పెరిగింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామాయంపేట సీఐ గంగాధర్ ఆదేశాల మేరకు చేగుంట ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు 24 గంటల పాటు కంటిమీద కనుకు లేకుండా రైల్వే గేటు వద్ద కాపలా కాస్తున్నారు. రైళ్లు వస్తున్న సమయంలో ప్రజలు రైలు పట్టాలవైపు రాకుండా చూడడంతో పాటు వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు. రైలు వెళ్లిపోగానే రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. రైలు గేటు పనులు ఇంకా నాలుగు రోజులు పాటు జరిగే అవకాశం ఉండడంతో అంతవరకూ అక్కడే ఉండి విధులు నిర్వర్తించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
రాలిన మరో కుసుమం
తూప్రాన్: గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న తరుణ్(9) చివరికి సోమవారం తనువు చాలించాడు. దీంతో మాసాయిపేట దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. ఈ నెల 24న తూప్రాన్ పట్టణంలోని కాకతీయ హైస్కూల్‌కు చెందిన బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 14 మంది చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందగా మరో 20 మంది చిన్నారులు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెల్దుర్తి మండలం గుండ్రెడ్డిపల్లికి చెందిన తరుణ్‌ను అదే రోజు యశోద ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గుండ్రెడ్డిపల్లిలో విషాదం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం, బాలమణి దంపతులకు తరుణ్, స్వాతి సంతానం. కుమారుడిని ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనుకున్న తల్లిదండ్రులు తూప్రాన్‌లోని కాకతీయ హైస్కూల్లో చేర్పించారు. ఈ క్రమంలోనే పాఠశాల బస్సును రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తరుణ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తమ బిడ్డలను ప్రాణాలతోనే చూస్తామని ఇన్నాళ్లూ ఆశించిన తరుణ్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తరుణ్ మృతితో గుండ్రెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. తరుణ్ మృతదేహాన్ని యశోద నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్యులు మంగళవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది.