నత్తనడకన రైల్వే గేటు పనులు
కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్న పోలీసులు
వెల్దుర్తి : మాసాయిపేట దుర్ఘటనలో 18 మంది చిన్నారులు మృత్యువాత పడినా, రైల్వే అధికారులు మాత్రం తమ మొద్దు నిద్ర వీడడం లేదు. 24వ తేదీ దుర్ఘటన జరిగిన వెంటనే దేశ వ్యాప్తంగా రైల్వే పనితీరుపై విమర్శలు వెల్లువెత్తగా, 25వ తేదీనే రైల్వే అధికారులు హుటాహుటీన గేటు ఏర్పాటు కోసం పనులు ప్రారంభించారు.
అయితే పనులు ప్రారంభమై వారం రోజులు గడిచినా పూర్తి కావడం లేదు. మరోవైపు ప్రమాదస్థలి నిజామాబాద్ - హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఈ దారి వెంట వెళుతున్న వారంతా వాహనాలు పక్కకు ఆపి ప్రమాద స్థలికి వెళ్లి మృతులకు నివాళులర్పిస్తున్నారు.
ఇక చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు, వివిధ పాఠశాలల చిన్నారులు పెద్దఎత్తున ప్రమాద స్థలికి తరలివస్తుండడంతో సంఘటన జరిగిన రైల్వే ట్రాక్ సమీపంలో రద్దీ బాగా పెరిగింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామాయంపేట సీఐ గంగాధర్ ఆదేశాల మేరకు చేగుంట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు 24 గంటల పాటు కంటిమీద కనుకు లేకుండా రైల్వే గేటు వద్ద కాపలా కాస్తున్నారు. రైళ్లు వస్తున్న సమయంలో ప్రజలు రైలు పట్టాలవైపు రాకుండా చూడడంతో పాటు వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు. రైలు వెళ్లిపోగానే రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.
రైలు గేటు పనులు ఇంకా నాలుగు రోజులు పాటు జరిగే అవకాశం ఉండడంతో అంతవరకూ అక్కడే ఉండి విధులు నిర్వర్తించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.