సాక్షి, విజయనగరం: విజయనగరం కంటకాపల్లి రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ జరపనున్నారు అధికారులు. బుధవారం, గురువారం విశాఖపట్నం డివిజనల్ మేనేజర్, వాల్తేర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఇప్పటికే అలమండ, కొత్తవలసల మధ్య ప్రత్యక్ష సాక్షుల్ని, అలాగే క్యాబిన్ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కోణంలోనే విచారణ అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
విజయనగరం రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 52 మందిని క్షతగాత్రులుగా గుర్తించింది. వీరిలో ఎక్కువమంది స్వల్ప గాయాలతో బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు అలమండ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలైన వారు, కళ్లు దెబ్బతిన్న వారు, ఎముకలు విరిగిన వారు 29 మంది విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేరారు. సోమవారం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లి వాళ్లను ఓదార్చారు. నేడు క్షతగాత్రులకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు వైద్యులు.
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన ఈ దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నెమ్మదిగా వెళ్తున్న పలాస-విశాఖ ప్యాసింజర్‌ను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన రాయగఢ-విశాఖ ప్యాసింజర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 13 మంది మృతి చెందారు. నిత్యం విశాఖకు రాకపోకలు సాగించే వందలాది మంది నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఆదివారం సెలవు నేపథ్యంలో రద్దీ చాలా తక్కువగా ఉంది. లేదంటే... ఎలా ఉండేదోనని ఆ ఘటనను తలచుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు.
సిగ్నలింగ్ లోపమా? మానవ తప్పిదమా?
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణించే సమయంలో ముందు వెళ్లే రైలు పట్టాలు తప్పినా, ఆగిపోయినా వెనుక వచ్చే రైలు ఆగిపోయేలా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయాలి. అలాగే.. రైలు వేగం గంటకు 10, 15 కిలోమీటర్లకు పరిమితం కావాలి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్లినా వెనుక వచ్చిన రాయగడ ప్యాసింజర్ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టడంతోనే పెనుప్రమాదం జరిగింది.
నేడు కూడా పలు రైళ్ల రద్దు
కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. రిజర్వేషన్ చేయించుకున్న పలువురు ఆదివారం రాత్రి నుంచి స్టేషన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రంలోపే కంటపల్లి వద్ద ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్ల సమయాల్లో మార్పు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఇవాళ(అక్టోబర్ 31న).. హావ్‌డా-సికింద్రాబాద్(12703) ఫలక్‌నుమా, హావ్‌డా-ఎస్‌ఎంవీ బెంగళూరు(12245) దురంతో, షాలిమార్-హైదరాబాద్(18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే.. తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(08531) పాసింజర్, తిరుపతి-విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్-కేఎస్‌ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 31న రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment