‘గేటు’ పెట్టిస్తాం ఓటేయండి.. ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం కోటి మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత ప్రజలను పట్టించుకోరనే విషయం... మాసాయిపేట ప్రమాదం నేపథ్యంలో మరోసారి రుజువైంది. గురువారం ప్రమాదం జరిగిన మాసాయిపేట లెవల్ క్రాసింగ్తోపాటు దానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లి, డిల్లాయ్, కూచారం తండాల వ ద్ద కూడా కాపలా లేని క్రాసింగ్లు ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. గేట్లు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు రైల్వే అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవటంతో విసిగిపోయిన ఆ ప్రాంతాల ప్రజలు... గత సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో కంగారుపడ్డ నేతలు... రైల్వే అధికారులను ఒప్పించి మరీ వెంటనే గేట్లు ఏర్పాటు చేయిస్తామని, ఓట్లేయాలని బతిమాలారు. దీంతో ప్రజలు ఓట్లేశారు. కానీ నేతలు మాత్రం తామిచ్చిన హామీని మరచిపోయారు.