భారత్‌లోనే భారీగా డేటా టారిఫ్‌లు!
న్యూఢిల్లీ : టెలికాం సర్వీసులు ప్రొవైడర్లు ఆఫర్ చేసే డేటా టారిఫ్‌లు భారత్‌లో చౌకగా ఉన్నాయని భావిస్తున్న యూజర్లకు షాకింగ్ న్యూస్. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లోనే డేటా టారిఫ్‌లు అధికంగా ఉన్నాయని టాప్ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం జీబీకి 228 రూపాయల సగటు ఆదాయాన్ని టెలికాం ఆపరేటర్లు ఆర్జిస్తున్నారని మాసన్ పేర్కొంది. వినియోగదారులు భరించగలిగే స్థాయిల్లో తలసరి ఆదాయాన్ని సవరించినప్పటికీ ఈ డేటా టారిఫ్ రేట్లు భారత్‌లో అధికంగానే ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. ఒకవేళ భారత్‌లో డేటా టారిఫ్‌లను 75 శాతం కట్ చేస్తే యూజర్ల వాడుకను పెంచుకోవచ్చని మాసన్ సంస్థ సూచించింది.
తలసరి స్థూల జాతీయ ఆదాయంలో డేటా టారిఫ్(1జీబీ ప్యాక్ ధర) 2.6 శాతంగా ఉన్నాయని, అదే అభివృద్ధి చెందుతున్న దేశాలోనైతే ఈ డేటా టారిఫ్ 0.4-0.5 శాతంగా ఉందని మాసన్ అధ్యయనం తెలిపింది. ఒకవేళ టెలికాం ఆపరేటర్లు 75 శాతం డేటా టారిఫ్‌లు తగ్గిస్తే 2019-20 కల్లా యూజర్ బేస్‌ను 645-667 మిలియన్లకు, నెలకు ఒక సిమ్ డేటా వాడకాన్ని 4.2-4.3 జీబీకి పెంచవచ్చని మాసన్ అధ్యయన విశ్లేషకులు సూచించారు. అయితే టెలికాం కంపెనీలు డేటా టారిఫ్‌లను వదులుకోవడానికి సిద్ధంగా లేరంటూ ఆశ్చర్యకరమైన విషయాన్ని మాసన్ తెలిపింది.
రిలయన్స్ జియో కమర్షియల్ లాంచింగ్ నేపథ్యంలో టెలికాం ఆపరేటర్ల మధ్య నెలకొన్న ధరల యుద్ధాన్ని ఈ స్టడీ ప్రస్తావించింది. జియో పేరుని ప్రస్తావించని అధ్యయనం కొత్త ప్లేయర్లు టెలికాం పరిశ్రమలోకి ప్రవేశించడం వల్ల వేగవంతగా పెరుగుతున్న 3జీ సామర్థ్యంతో పాటు, 4జీకి డిమాండ్‌ను పెంచుతున్నారని హర్షం వ్యక్తంచేసింది. 4జీ సప్లై వల్ల మొదటిసారి దేశంలో వినియోగదారుల ప్రవర్తనలో మార్పులు చూస్తున్నామని.. హై స్పీడ్ బ్రాండ్ బ్యాండ్ నెట్‌వర్క్‌లపై వినియోగదారులు ఎక్కువగా దృష్టిసారిస్తున్నట్టు తెలిపింది.