మసూద్‌పై చైనాకు అమెరికా షాక్!
మసూద్ విషయంలో వీటోతో తమను అడ్డుకోలేరని వ్యాఖ్య
ఐరాస: ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా కొన్ని దేశాలు వీటో అధికారాన్ని ప్రయోగించినంతమాత్రాన తాము వెనుకకు తగ్గబోమని, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోని తీరుతామని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన జెషే మహహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్‌పై ఐక్యరాజ్యసమితిలో ఆంక్షలు విధించకుండా చైనా వీటోతో అడ్డుకుంటున్న నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఉగ్రవాదులపై ఆంక్షల అంశాన్ని అమెరికా యంత్రాంగం ప్రస్తుతం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నదని, ఈ విషయంలో తమ పాత్రను కచ్చితంగా పోషిస్తామని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ తెలిపారు. ఏప్రిల్ నెలకుగాను భద్రతా మండలి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉగ్రవాది మసూద్ విషయంలో చైనా వీటోను ప్రయోగిస్తున్న అంశాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ దక్షిణాసియాలో ఉగ్రవాదులపై ఆంక్షలు, ఆ ఆంక్షలను అడ్డుకోవడానికి ఐరాస శాశ్వత సభ్యులు చేస్తున్న ప్రయత్నాల గురించి ఆమెను విలేకరులు ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. కొన్ని విషయాలలో వీటో ప్రయోగించినంత మాత్రాన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో తాము వెనుకాడబోమని నిక్కీ హెలీ పేర్కొన్నారు.