Mass image
-
మాస్‌ని మెస్మరైజ్ చేసేలా....
బాలకృష్ణ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అందుకు తగ్గట్టే పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారాయన. ప్రస్తుతం సత్యదేవ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం పత్రికల వారికి విడుదల చేశారు. కళ్లజోడు, గళ్ల లుంగీతో మాస్‌ని మెస్మరైజ్ చేసేలా ఉన్నారు ఈ ఫస్ట్‌లుక్‌లో బాలయ్య. మాస్‌ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రం రూపొందుతోందని ఈ ఫస్ట్‌లుక్ చెప్పకనే చెబుతోంది. ఇందులో బాలకృష్ణ సీబీఐ ఆధికారిగా నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర మూడు డైమన్షన్లతో అత్యంత శక్తిమంతంగా సాగుతుందని యూనిట్ సభ్యుల సమాచారం. 60 శాతం షూటింగ్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుంది. బాలకృష్ణకు జోడీగా త్రిష నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ‘లెజెండ్’ ఫేమ్ రాధికా ఆప్టే మరో కథానాయిక. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత, నిర్మాణం: ఎస్.ఎల్.వి.సినిమా. -
నచ్చినోళ్లతోనే....
కాలం కలిసొస్తే ఎన్ని కబుర్లైనా చెబుతారు. ప్రస్తుతం అలాంటి బడాయిలే పోతోంది నటి లక్ష్మీమీనన్. ఈ కుంకీ కథానాయకి చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కోలీవుడ్‌లో అపజయం ఎరగని హీరోయిన్గా లక్ష్మీమీనన్‌కు పేరుంది. తొలి చిత్రం కుంకి నుంచి ఈ మధ్య తెరపైకొచ్చిన మంజాపై వరకు ఆమె ఖాతాలో వరుస హిట్లే నమోదయ్యాయి. ఈ మలయాళి భామ ఈ విజయాలను ఎంజాయ్ చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఎవరెలా అనుకున్నా విజయాలు ప్రవర్తనలో మార్పుకు కారణం అవుతాయి. నటి లక్ష్మీమీనన్ ఇందుకు అతీతం కాదు. తొలుత అవకాశాలొస్తే చాలనుకున్న ఈ కేరళ కుట్టి ఆ తర్వాత మంచి కథా పాత్రలు కావాలని కోరుకుంది. అలాంటిది ఆమె తాజాగా తాను నటించే చిత్రాల్లో హీరోలు తనకు నచ్చిన వారై ఉండాలని షరతులు పెడుతోందట. ఇలాంటి కండీషన్ ఇంతకు ముందు ఏ నటి విధించి ఉండరు. ఇప్పటి వరకు రెండవ కేటగిరి హీరోల సరసన నటించిన ఈ అమ్మడిప్పుడు ప్రముఖ హీరోలు, మాస్ ఇమేజ్ కలిగిన హీరోలతో డ్యూయెట్లు పాడాలని ఆశిస్తోందని సమాచారం. దీంతో వర్ధమాన నటుల చిత్రాలను నిరాకరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగకుండా తన ఆశను నెరవేర్చుకునే పనిలో భాగంగా ప్రముఖ నటులను పరిపరి విధాలుగా పొగడ్తలతో ముంచెత్తుతోంది. అలాగే తనకు తెలిసిన దర్శకులతో సిఫార్సు చేసుకునే పనిలో పడిందట. మరి అలాంటి ఈ నెరజాణ నటుడు కార్తి సరసన నటించే అవకాశాల్ని ఎందుకు జారవిడచుకుందోనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
నాకలా కనిపించాలంటే భయం!
‘‘ఇలాంటివి నీకు నప్పవు అని ఎవరైనా అన్నారనుకోండీ... అలాంటి వాటి జోలికే వెళ్తా. ఇప్పుడే కాదు... చిన్నప్పట్నుంచీ నా మెంటాలిటీ అంతే’’ అంటున్నారు సమంత. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆమె నటించిన ‘అల్లుడు శీను’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తనకు మంచి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిందని సమంత ఆనందం వెలిబుచ్చుతూ మీడియాతో ముచ్చటించారు. ‘అల్లుడు శీను’లో కాస్త స్పైసీగా కనిపించినట్లున్నారు? ఏమాయ చేశావె, ఈగ, మనం లాంటి పాత్రలు చేస్తే... సమంత ఇవి తప్ప మరొకటి చేయలేదు అని రాస్తారు. కాస్త భిన్నంగా స్పైసీగా కనిపిస్తే... సమంత మరీ ఇలా చేసేస్తుందా అని రాస్తారు. నిజానికి నాకు గ్లామర్‌గా కనిపించడం అంటే భయం. అందరూ ధైర్యం చెప్పి ఈ పాత్ర చేయించారు. తమన్నా, కాజల్, శ్రుతీహాసన్‌ల పోటీ తట్టుకోవడానికే ఇలా గ్లామర్ డోస్ పెంచారా? ఒక పోటీ రంగంలో ఉన్నప్పుడు తోటి తారల్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు మొదట్నుంచీ నీట్ ఇమేజ్ ఉంది. ‘నీకు అలాంటి పాత్రలే సరిపోతాయి, గ్లామర్ పాత్రలు నీకు నప్పవు’ అని ఎవరైనా అన్నారనుకోండీ... నేను వాటి వైపే వెళ్తా. చేసి నా సత్తా నిరూపిస్తా. అవునూ... ఈ సినిమాకు పారితోషికం భారీగా ముట్టిందట కదా? ఈ సినిమాకు పారితోషికంగా ఇల్లు రాసిచ్చారనీ, రెండు కోట్లు తీసుకున్నానని ఇలా చాలా రూమర్లు వచ్చాయి. నిజానికి కేవలం నిర్మాత బెల్లంకొండ సురేశ్‌గారి మీదున్న అభిమానంతో ఈ సినిమా చేశాను. భారీ పారితోషికం తీసుకున్న మాట అవాస్తవం. అయినా... ఇన్ని విజయాల తర్వాత కూడా నా పారితోషికం పెరగలేదు. దానికి కారణం ఏంటి? అనేది నాకు ఇప్పటికీ తెలీని విషయం. హీరోలకు పారితోషికాల కింద నిర్మాతలు ఏరియాలను రాసిచ్చేస్తుంటారు. కానీ... మా హీరోయిన్లకు ఎందుకు రాసివ్వరు? అందుకే మాక్కూడా ఓ ఏరియా రాసిస్తే బావుటుంది. ఏ ఏరియా తీసుకుంటే కరెక్టో మీరే చెప్పండి (సరదాగా) మీ ‘రభస’, ‘సికిందర్’ సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి. మీ అంచనా ఏంటి? ‘రభస’ విజయంలో నాకు టెన్షన్ లేదు. ‘సికిందర్’ విషయంలోనే టెన్షన్ అంతా. తమిళంలో నేను చేస్తున్న తొలి భారీ చిత్రమది. ఇప్పటిదాకా తమిళంలో నాకు సరైన విజయం లేదు. ఈ సినిమాతో అక్కడ కూడా నా ఫేట్ మారుతుందని ఆశిస్తున్నా. బాలీవుడ్లో స్త్రీ ప్రాధాన్యత చిత్రాలు వస్తున్నాయి. అలాంటి పాత్రలు మీరెందుకు చేయరు? ఉన్న వాటిల్లో మంచి పాత్రలే చేస్తున్నాను. ఇప్పుడున్న హీరోయిన్లలో మెచ్చదగ్గ పాత్రలు దక్కింది నాకే. ముఖ్యమైన విషయం ఏంటంటే... ఇక నుంచి ప్రాధాన్యత, విలువలు, అభినయానికి ఆస్కారమున్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. అందుకే.. చాలా సినిమాల్ని వదులుకున్నాను కూడా. ఇక నుంచి పాత్రల విషయంలో జాగ్రత్తగా వెళ్తాను.