ఔను.. అది నిజమే!
చార్మి ఎంత మంచి నటో, అంత మంచి డాన్సర్ కూడా. ఆమె ఎంత బాగా డాన్స్ చేస్తుందో చెప్పడానికి ఓ ఉదాహరణ ‘డమరుకం'లోని ‘ఏస్కో నా గుమా గుమా ఛాయ్...’ పాట. ప్రస్తుతం చార్మి ఆ తరహా మాస్ మసాలా సాంగ్ చేస్తున్నారనీ, ఇది తమిళ స్టయిల్ డాన్స్ అని ఓ వార్త ప్రచారంలో ఉంది. ‘ఔను.. ఆ వార్త నిజమే’ అని చార్మి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తమిళ చిత్రం ‘పత్తు ఎణ్రదుకుళ్ల’ కోసం ఆ చిత్రకథానాయకుడు విక్రమ్‌తో కలిసి చార్మి ఈ పాటకు కాలు కదుపుతున్నారు. తొమ్మిది నిమిషాల నిడివితో సాగే ఈ పాట చిత్రీకరణ గురువారం చెన్నైలో మొదలైంది.
దీనికోసం భారీ సెట్ వేశారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగులో ప్రస్తుతం ‘మంత్ర 2’ చిత్రంలో నటిస్తున్న చార్మి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మి' చిత్రం చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె బాగా సన్నబడ్డారు కూడా. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మార్చి ప్రథమార్ధంలో షూటింగ్ షురూ కానుంది.