ఇటాలియన్ మెరైన్‌కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో ఇటాలియన్ మెరైన్‌కు ఊరట లభించింది. ఇటలీలో ఉండేందుకు మూడు నెలల పాటు న్యాయస్థానం మాసిమిలానో లాతోర్కు గడువు పొడిగించింది. మెరైన్ మాసిమిలానో అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం ఇటలీ వెళ్లేందుకు గతంలో అతనికి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా 2012లో కేరళ తీరం వెంబడి చేపలవేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ఎన్రికా లెక్సి పై ఉన్న మెరైన్లు కాల్పులు జరపడంతో ఇద్దరు భారతీయ జాలర్లు చనిపోయారు. జరిగిన ఈ ఘటనపై మొదట కేరళ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం కేసు హై కోర్టు పరిధిలోనిది కాదని చెబుతూ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.