జిలకర మసూర @రూ.20వేలు
ధరల పెరుగుదలతో లాభపడుతున్న దళారులు
మనుబోలు :జిలకర మసూర ధాన్యం ప్రస్తుతం పుట్టి రూ.20 వేలు పలుకుతుంది. దీని వల్ల రైతులకన్నా దళారులే ఎక్కువగా లాభపడుతున్నారు. జిలకర మసూర రకం నిల్వ చేసుకున్న కొద్ది మంది రైతులతో పాటు దళారులు కొన్ని రోజులుగా మండలంలో ముమ్మరంగా ధాన్యం విక్రయిస్తున్నారు. పుట్టి రూ.19,200 నుంచి రూ.20 వేల ధరకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో పుట్టి రూ.12 నుంచి రూ.13 వేలు మాత్రమే ఉన్న జిలకర మసూర ధర కొద్ది రోజులుగా అమాంతంగా పెరిగిపోయింది. నాలుగైదు నెలల్లోనే పుట్టికి రూ.7 వేల నుంచి రూ.8 వేలు ధర పెరగడంతో నిల్వ చేసుకునే వసతి లేక అప్పుడే అమ్ముకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొని ధాన్యం నిల్వ చేసుకున్న దళారులు ఖుషిగా ఉన్నారు. ధరల పెరుగుదలతో ప్రస్తుతం లాభపడుతున్న వారిలో 10 శాతం మంది మాత్రమే రైతులు ఉండగా, మిగిలిన 90 శాతం మంది దళారులు, మిల్లర్లు ఉన్నారు. గోడౌన్లు అందుబాటులో లేకపోవడంతో 90 శాతం రైతులు అప్పుడే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్నారు. ప్రభుత్వం గోడౌలు కట్టించి రైతులకు అందుబాటులోకి తెస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులంటున్నారు.